కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కొందరు భారత క్రికెటర్లు రెస్టారెంట్‌కు వెళ్లారన్న ఆస్ట్రేలియా మీడియా కథనాలను బీసీసీఐ ఖండించింది. కరోనా నిబంధనలు ఉల్లఘించిన క్రికెటర్లపై బోర్డు దర్యాప్తు ప్రారంభించిందన్న వార్తలు ఊహాజనితమని స్పష్టం చేసింది. తమ క్రికెటర్లకు కొవిడ్ ప్రోటోకాల్స్ గురించి బాగా తెలుసని.. వారు ఏ నిబంధనను ఉల్లంఘించలేదని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
నిబంధనల ప్రకారం కరోనా సోకకుండా క్రికెటర్లు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే రెస్టారెంట్‌లో తినడానికి అనుమతిస్తారని బీసీసీఐ స్పష్టం చేసింది. రెండో టెస్టులో ఓటమిని జీర్ణించుకోలేని ఆస్ట్రేలియాకు చెందిన ఒక వర్గం మీడియా ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తోందని బోర్డు అధికారి ఆరోపించారు.
క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, నవదీప్ సైనీ, శుబ్‌మన్ గిల్‌లు రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న చిత్రాలు, వీడియోలను నవల్‌దీప్ సింగ్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఉంచిన తర్వాత ఈ గందరగోళం ప్రారంభమైంది. అనంతరం గందరగోళం సృష్టించినందుకు నవల్‌దీప్ క్షమాపణ చెప్పాడు.