బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి చేపట్టనున్న సౌరభ్ గంగూలీ టీమిండియా సెలక్టర్లతో సమావేశం కానున్నాడు. అక్టోబర్ 24న సెలక్టర్లతో భేటీ అవుతానని గంగూలీ తెలిపాడు. ఈ సమావేశంలో ధోనీ గురించి సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకుంటానని.. ఆ తర్వాత ఆయనతోనూ మాట్లాడతానని దాదా స్పష్టం చేశాడు.
" అక్టోబర్ 24న సెలక్టర్లతో సమావేశమవుతా. ధోనీ భవితవ్యంపై సెలక్టర్లు అభిప్రాయాలు తీసుకుంటాను. ఆ తర్వాత ధోనీతో మాట్లాడి అతడు ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకుంటా. అంతకుముందు నేను బోర్డులో లేనందువల్ల గత విషయాల గురించి పూర్తిగా తెలియదు. సెలక్టర్లు, ధోనీతో మాట్లాడి నా అభిప్రాయాన్ని వెల్లడిస్తాను. సమావేశానికి సెలక్టర్లతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా హాజరవుతాడు. నిబంధనల్లో మార్పుల వల్ల సమావేశంలో కోచ్ రవిశాస్త్రి ఉండరు".
--గంగూలీ, టీమిండియా మాజీ సారథి
ప్రపంచకప్ అనంతరం క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు ధోనీ. భారత ఆర్మీకి సేవలందిచాలనే ఉద్దేశంతో వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కూ మిస్టర్ కూల్ అందుబాటులో లేడు. నవంబర్‌లో జరగనున్న బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.