టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్సీ నుంచి ధోనీని తప్పించాలనుకున్న సెలక్టర్ల నిర్ణయాన్ని తాను అడ్డుకున్నట్లు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ తెలిపాడు. ధోనీనే సారథిగా ఉంటాడని స్పష్టం చేసినట్లు చెప్పారు.
![dhoni latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8458453_565_8458453_1597716123547.png)
"2011లో టీమ్‌ఇండియా ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టుల్లో జట్టు విఫలమైంది. దీంతో వన్డే సారథ్యం నుంచి ధోనీని తప్పించాలని ఓ సెలక్టర్ భావించాడు. అయినా వన్డే కెప్టెన్సీ నుంచి ధోనీని ఎలా తొలగిస్తారు? అంతకుముందే ధోనీ ప్రపంచకప్ గెలిచాడు. అతడి స్థానంలో కెప్టెన్ ఎవరన్న విషయం కూడా సెలక్టర్లు ఆలోచించలేదు. ఆరోజు సెలవు కావడం వల్ల గోల్ఫ్ ఆడి తిరిగొచ్చా. అప్పటి కార్యదర్శి సంజయ్ జగ్దాలె నా దగ్గరకు వచ్చి 'సర్, ధోనీని కెప్టెన్‌గా తీసుకునేందుకు సెలక్టర్లు విముఖత చూపుతున్నారు. ఆటగాడిగా తీసుకుంటామని అంటున్నారు' అని చెప్పాడు. ధోనీనే కెప్టెన్‌గా ఉంటాడని అప్పుడే స్పష్టంచేశా. ఇందుకోసం బీసీసీఐ అధ్యక్షుడిగా నా అధికారాన్నంతా ఉపయోగించాను"
-- శ్రీనివాసన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు.
ధోనీ ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయినా సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్-13వ సీజన్లో బరిలోకి దిగనున్నాడు.
ఐపీఎల్-2022 వరకు మహీ తమకు అందుబాటులో ఉంటాడని చెన్నై సూపర్‌కింగ్స్ ధీమా వ్యక్తం చేసింది. 2020, 2021 సీజన్లలో కచ్చితంగా పాల్గొంటాడని స్పష్టం చేసింది. 2022లో కూడా ఆడతాడని తాము అంచనా వేస్తున్నామని సీఎస్కే యాజమాన్యం పేర్కొంది.