టీమిండియా మహిళా జట్టు మాజీ సారథి, క్రికెట్ సలహా కమిటీ మాజీ సభ్యురాలు శాంత రంగస్వామి, మరో సభ్యుడు అన్షుమన్ గైక్వాడ్‌కు ఊరట లభించింది. విరుద్ధ ప్రయోజనాల అంశంలో వీరిద్దరికీ భాగస్వామ్యం లేదన్నారు బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్. ఈ శనివారం(డిసెంబరు 28) జరిగిన విచారణ తర్వాత ఈ విషయంపై స్పష్టత నిచ్చారు జైన్. ఇటీవలే వీరిద్దరూ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ), భారత క్రికెటర్ల సంఘం (ఐపీఏ) పదవుల నుంచి వైదొలగడం వల్ల ఈ కేసు నుంచి ఉపశమనం లభించినట్లయిందని చెప్పారు.
కపిల్‌దేవ్‌కు మాత్రం ఇంకా ఈ విషయంలో పూర్తిగా ఊరట లభించలేదు. ఫిర్యాదుదారుడు సంజీవ్ గుప్తా మరో దరఖాస్తు చేయాలనుకోవడం వల్ల తీర్పు ఆలస్యం కానుంది. ఇప్పటికే కపిల్.. విచారణకు హాజరయ్యాడు. బీసీసీఐలో ఏ వ్యక్తయినా, రెండు లాభాదాయక పదవుల్లో ఉంటే ఈ విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తారు. వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు పూర్తి హక్కులు బీసీసీఐ ఎథిక్స్ అధికారికి ఉంటాయి.
కోచ్ ఎంపికలో కీలకపాత్ర
గతంలో కపిల్‌దేవ్, అన్షుమన్, శాంత రంగస్వామి... క్రికెట్ సలహా కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రిని రెండోసారి ఆ పదవికి ఎంపిక చేసిందీ కమిటీయే. అనంతరం పరస్పర విరుద్ధ ప్రయోజనాలను పొందుతున్నారని వీరిపై మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం జీవితకాల సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఈ ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు.