ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను బీసీసీఐ వ్యతిరేకించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ముంబయిలో జనవరి 12న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులతో బీసీసీఐ చర్చించనున్నదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. నాలుగు రోజుల టెస్టు అంశంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి అభిప్రాయాల్ని బోర్డు గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. కోహ్లీ, రవిశాస్త్రి టెస్టుల నిడివిని తగ్గించడాన్ని వ్యతిరేకించారు.
"ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులతో చర్చిస్తాం. అయితే మేము భారత సారథి కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి అభిప్రాయాలను గౌరవిస్తాం. సంప్రదాయ ఫార్మాట్ నిడివిని తగ్గించేందుకు మద్దతు ఇవ్వలేం. ఇది కేవలం మా కెప్టెన్, కోచ్ అభిప్రాయాలే కాదు. ఇంగ్లాండ్ సారథి జో రూట్, దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ కూడా తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. నాలుగు రోజుల టెస్టు చిన్న జట్లకు ఫలితాన్ని ఇస్తుందేమో, కానీ పెద్ద జట్లు తలపడితే ఫలితం తేలదు. సంప్రదాయ ఫార్మాట్‌లో మార్పులు చేయకూడదు"
-- బీసీసీఐ అధికారి
2023-31 మధ్య కొత్త భవిష్యత్ పర్యటనల ప్రణాళికలో నాలుగు రోజుల టెస్టులు నిర్వహించాలనే ఐసీసీ ప్రతిపాదించింది. అయితే దీనిపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్, రికీ పాంటింగ్, షోయబ్ అక్తర్, ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే నాలుగు రోజుల టెస్టు నిర్వహించాలని ఐసీసీ పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ అంశంపై మార్చిలో జరిగే వార్షిక సమావేశంలో ఐసీసీ చర్చించనుంది. కానీ బిగ్‌త్రీ (భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా) మద్దతు లేకుండా ఐసీసీ నాలుగు రోజుల టెస్టును నిర్వహించడం దాదాపు అసాధ్యమే.
కుంబ్లే నాయకత్వంలో కమిటీ..
దుబాయ్ వేదికగా మార్చి 27 నుంచి 31 వరకు ఐసీసీ సమావేశం జరగనుంది. 4 రోజుల టెస్టు ప్రతిపాదనపై నియమించిన కమిటీలో కుంబ్లేతోపాటు ఆండ్రూ స్ట్రాస్, రాహుల్ ద్రవిడ్, మహేలా జయవర్ధనే, షాన్ పొలాక్ సభ్యులుగా ఉన్నారు. ఈ అంశంపై వీరు లోతుగా అధ్యయనం చేయనున్నారు.
ఇవీ చదవండి...