శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల పర్యటనకు బీసీసీఐ అంగీకారం తెలిపిందని సమాచారం. ఈ మ్యాచులు వీక్షించేందుకు 30-40% అభిమానులను అనుమతించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటారని తెలుస్తోంది.
కరోనా వైరస్ కారణంగా మార్చి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. అన్ని దేశాలూ ఏదో ఒక రూపంలో లాక్‌డౌన్ అనుభవించాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే కొవిడ్-19పై ఒక అంచనా వస్తుండటం వల్ల తిరిగి క్రికెట్‌ను మైదానం బాట పట్టించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనను బీసీసీఐ ఖాయం చేసేసింది. ఇప్పుడు శ్రీలంక పర్యటనకూ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా సిరీస్ మధ్యలోనే ఆగిపోయిన తర్వాత టీమ్ఇండియా క్రికెట్ ఆడలేదు.
ఇతర దేశాలతో పోలిస్తే శ్రీలంకలో వైరస్ ప్రభావం తక్కువగా ఉండటం వల్లే ఈ సిరీస్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వాస్తవంగా ఈ పర్యటన జూన్‌లో ఉండాలి. వైరస్ కారణంగా వాయిదా పడింది. గత ప్రణాళిక ప్రకారమే వేదికలు ఉంటాయి. 30-40 శాతం సీట్లు నింపేందుకు శ్రీలంక క్రికెట్ సిద్ధమవుతోంది. అయితే ప్రభుత్వం అనుమతిస్తేనే ఇది సాధ్యమవుతుంది.
"30-40% వీక్షకులను అనుమతించాలని భావిస్తున్నాం. అభిమానులు ఒక్కొక్కరూ మీటర్ దూరం కూర్చొని మ్యాచులను వీక్షించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికి తుది నిర్ణయం వైద్య, ఆరోగ్యశాఖ తీసుకుంటుంది. వారి సూచనలు పాటించాల్సిందే" అని శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యులొకరు మీడియాకు తెలిపారు. శ్రీలంకలో ఆసియాకప్-2020ని నిర్వహించేందుకు పాకిస్థాన్ ఈ మధ్యే అంగీకరించింది.
ఇదీ చూడండి... కోహ్లీ, రోహిత్‌ను ఔట్ చేసేందుకు అంపైర్ సలహాలు!