ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకున్న పాకిస్థాన్ జట్టు స్వదేశానికి చేరుకుంది. అయితే ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్ మాత్రం అక్కడ జరిగే టీ20 లీగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ఈ టోర్నీలో సోమర్సెట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు బాబర్. అయితే ఆ జట్టు జెర్సీపై ఓ ఆల్కహాల్‌కు సంబంధించిన బ్రాండ్ లోగో ఉంది.
తాజాగా ఆ జెర్సీ ధరించిన బాబర్ చిత్రం ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో పాక్ అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అది పొరపాటున జరిగిందని.. ఇప్పటికే తాను ఫ్రాంచైజీతో ఆల్కహాల్ బ్రాండ్ లోగో ఉన్న జెర్సీని ధరించనని ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం చేశాడు బాబర్. తర్వాత మ్యాచ్‌లో ఆ లోగో ఉండదని హామీ ఇచ్చాడు.
సోమర్సెట్ తరఫున మొదటి మ్యాచ్ ఆడిన బాబర్ 42 పరుగులతో పాటు స్టన్నింగ్ క్యాచ్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
పాక్ ఆటగాళ్లతో పాటు వేరే దేశాలకు ప్రాతినిధ్యం వహించే ముస్లిం ఆటగాళ్లూ తమ జెర్సీలపై ఆల్కహాల్‌కు సంబంధించిన బ్రాండ్ లోగోలను ధరించడానికి నిరాకరించారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కు చెందిన ముస్లిం ఆటగాళ్లూ తమ బోర్డులకు నష్టం వచ్చినా.. అలాంటి పని చేయమని ఇప్పటికే స్పష్టం చేశారు.
పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లను ఇంగ్లాండ్ టీ20 లీగ్‌లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది పీసీబీ. అందులో బాబర్ అజామ్, ఇమాద్ వాసీం, షాహీన్ షా ఉన్నారు.