ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా పలు టోర్నీలు రద్దవగా, మరికొన్ని వాయిదా పడుతున్నాయి. ఈనెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. వచ్చే నెల 15 నుంచి మొదలు కానుంది. అయితే ఇందులో ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొనేది లేనిది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఇదే జరిగితే ఫ్రాంఛైజీల నుంచి వారికి రావాల్సిన మిలియన్ డాలర్లు కోల్పోవాల్సి వస్తుంది. భారత్ వెళ్లేందుకు, క్రికెటర్లకు నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇచ్చే విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) పునరాలోచనలో ఉంది.
ఆసీస్ క్రికెటర్లకు ఎన్ఓసీ ఇవ్వకపోతే?
ఒకవేళ ఆసీస్ క్రికెట్ బోర్డు.. తమ ఆటగాళ్లకు ఎన్ఓసీ ఇవ్వకపోతే, ఐపీఎల్ ఫ్రాంఛైజీల నుంచి వారికి వేలంలోని డబ్బులు ఇవ్వకపోవచ్చు. భారీ ధర పలికిన పాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి వారికి ఇది ఆర్థికంగా నష్టమే!
గతేడాది డిసెంబరులో జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్‌ను రూ.15.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది కోల్‌కతా నైట్‌రైడర్స్. విదేశీ ప్లేయర్లలో ఇప్పటివరకు ఇదే అత్యధిక మొత్తం. మరోవైపు మ్యాక్స్‌వెల్‌ను రూ.10.75 కోట్లు పెట్టి కొనుక్కుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.