టీమిండియా టెస్టు వైస్‌కెప్టెన్ అజింక్య రహానే.. రెండేళ్లుగా వన్డే జట్టులో చోటు సంపాదించలేకపోతున్నాడు. టెస్టులకు ఎంపికవుతున్నా, పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇతడికి సెలక్టర్లు మొండిచేయి చూపిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన రహానే.. క్రికెట్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని.. అందుకు అనుగుణంగా మారక తప్పదని అన్నాడు.
"రెండేళ్లుగా నా రికార్డు బాగుందని అందరూ అంటున్నారు. అదే నిజం. కానీ ఇలాంటి ప్రదర్శన ఉన్నా, తుది జట్టులో ఎంపిక కాకపోవటం ఆశ్చర్యంగా ఉంది. క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు మంచి ప్రదర్శన ఇచ్చినా, జట్టులో స్థానం లభించకపోవటం బాధకరమైనదే. 2019 ప్రపంచకప్ జట్టులో చోటు దొరకని సమయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని గమనించాను"
- అజింక్య రహానే, టీమిండియా క్రికెటర్
రహానే.. చివరిగా 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాడు. అందులో రహానే అత్యధిక స్కోరు 79. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో రెండు అర్ధ సెంచరీలు, దక్షిణాఫ్రికాపై సెంచరీ చేశాడు. ప్రపంచకప్ జట్టులో స్థానం లభించకపోయినా, కౌంటీ క్రికెట్ ఆడటానికి ఆ సమయాన్ని వినియోగించుకున్నాడు.
ఇదీ చదవండి:- డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన జాతీయ క్రికెట్ సెలక్టర్