ఆస్ట్రేలియా అంటేనే పెద్ద సవాల్.. అందులోనూ నాలుగు టెస్టుల సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు.. అతడి గైర్హాజరీలో టీమ్‌ఇండియా సత్తా చాటగలదా..? ఈసారి కంగారూ జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.. మరి భారత్ మరోసారి సిరీస్ గెలవగలదా..? ఆసీస్‌లో కోహ్లీ బృందం అడుగుపెట్టినప్పటి నుంచి ఇలా ఎన్నో ప్రశ్నలు..! ఆటలో బలాబలాలు అటుంచితే అంతకుముందే ఓ సమస్య టీమ్‌ఇండియాకు సవాల్‌గా నిలిచేలా ఉంది. అదే బయో బబుల్. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన వారిలో చాలా మంది ఇప్పటికే మూడు నెలలుగా బయో బబుల్‌లో ఉన్నారు. ఇంకో రెండు నెలలు ఉండక తప్పని పరిస్థితి. మానసికంగా ఆటగాళ్లకు ఇది అతిపెద్ద సవాలే.
సుదీర్ఘ పర్యటనలో ఆటగాళ్ల మానసిక ఫిట్‌నెస్ టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం కానుంది. ఆసీస్‌తో మూడేసి వన్డేలు, టీ20లు.. 4 టెస్టులు ఆడేందుకు టీమ్‌ఇండియా ఈనెల 12న సిడ్నీలో అడుగుపెట్టింది. జనవరి 19న పర్యటన ముగుస్తుంది. అంటే.. రెండు నెలలకు పైమాటే. పుజారా, విహారిలను మినహాయిస్తే మిగతా ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో ఆడారు. దాదాపు 80 రోజుల పాటు బయో బబుల్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆసీస్ పర్యటనలో రెండు నెలలకు పైగా బుడగ జీవితంలో ఉండాలి. ఈ లెక్కన సుమారు అయిదు నెలలు ఆటగాళ్లంతా బుడగలోనే గడపాలన్న మాట.
వందల సంఖ్యలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది చుట్టూ ఉండగా.. చూస్తుండగానే యూఏఈలో ఐపీఎల్ ముగిసింది. ఆటగాళ్లు విసుగు చెందకుండా.. ఒంటరితనం అనిపించకుండా ఫ్రాంచైజీలు రకరకాల వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యుల్లో ఆహ్లాదం నింపుతూ ఎప్పటికప్పుడు బిజీగా ఉంచాయి. దీంతో బుడగలో నుంచి కాలు బయట పెట్టకపోయినా.. షాపింగ్‌లకు వెళ్లకపోయినా.. బంధువులు, స్నేహితుల్ని కలవలేకపోయినా పెద్దగా తేడా అనిపించలేదు. దాదాపు మూడు నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి.
అక్కడ భిన్నంగా..
ఆసీస్‌లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉండే అవకాశముంది. ఇక్కడ వినోదం పంచేవాళ్లు ఎవరూ ఉండరు. పెళ్లైన వాళ్లు భార్య, పిల్లలతో ఉండాలి. పెళ్లికాని వాళ్లు ఒంటరిగా లేదా తోటి ఆటగాడి (షేరింగ్ రూమ్)తో కలిసి ఉండాలి. బయటకు వెళ్లే అవకాశమే లేదు. మైదానానికి వెళ్లిరావడం.. మిగతా సమయమంతా హోటల్‌లో ఉండటం మినహా మరెలాంటి వ్యాపకాలు ఉండకపోవచ్చు. రెండు నెలలకు పైగా ఒకే మాదిరి దినచర్య ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని జట్టు మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. ఐపీఎల్ చివర్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఇదే అభిప్రాయం వెలిబుచ్చాడు.
"సుదీర్ఘ కాలం బుడగలో ఉండటం ఆటగాళ్లకు కష్టమే. పర్యటన లేదా సిరీస్ ఎన్ని రోజులు ఉంటుంది? ఎక్కువ రోజులు ఒకే తరహా వాతావరణంలో ఉండటం వల్ల.. ఆటగాళ్ల మానసిక స్థితిపై దాని ప్రభావం ఎంతుంటుంది? ఈ విషయాల్ని కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి"
- విరాట్ కోహ్లీ, టీమ్‌ఇండియా కెప్టెన్
ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు ఈసారి ఆసీస్ పర్యటన భిన్నమైన సవాలే. మైదానంలో సత్తాచాటడం సహా పర్యటన ఆసాంతం మానసికంగా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండటం కూడా కీలకం. ఆసీస్ పర్యటన అంటేనే స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరు. ప్రత్యర్థి ఆటగాళ్ల భావోద్వేగాల్ని రెచ్చగొట్టడంలో ఆసీస్ క్రికెటర్లు సిద్ధహస్తులు. ఫామ్‌లో లేనివాళ్లు, మైదానంలో ఎదురయ్యే సవాళ్ల నుంచి ఉపశమనం పొందాలనుకునే ఆటగాళ్లు సరదాగా షికారుకు వెళ్లడం.. బీచ్‌లో గడపటం.. పబ్‌లకు వెళ్లడం విదేశీ పర్యటనలో సాధారణం! ఇప్పుడలాంటి వెసులుబాటు లేకపోవడం ఆటగాళ్లకు ఇబ్బందే.
ఆసీస్‌కు ఆ సమస్య లేదు
పుజారా, విహారి మినహా ప్రస్తుత టీమ్‌ఇండియాలోని ఆటగాళ్లంతా ఐపీఎల్ బుడగ నేరుగా ఆసీస్ బబుల్‌లోకి వచ్చారు. ఆసీస్ ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కమిన్స్ (మూడు ఫార్మాట్లలో)లు మాత్రమే అలాంటి పరిస్థితిలో ఉన్నారు. టెస్టు, వన్డే, టీ20ల్లో భిన్నమైన ఆటగాళ్లు ఉండటం వల్ల బుడగలో ఎక్కువ రోజులు ఉండాల్సిన పనిలేదు. ఫలితంగా కంగారూలకు మానసిక ఫిట్‌నెస్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. భారత ఆటగాళ్లకే సమస్య. మరో రెండు నెలలు బబుల్‌లో ఉండాల్సి రావడం మానసికంగా పెద్ద సవాలే.