తాను 28 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించడానికి పాకిస్థాన్ జట్టు యాజమాన్యమే కారణమని ఆ జట్టు పేసర్ మహ్మద్ అమిర్ ఆరోపించాడు. మూడు రోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు... తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రధాన కోచ్ మిస్బాఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్.. జట్టులో తనపై తప్పుడు ప్రచారం చేశారని అన్నాడు. తనకు టెస్టు క్రికెట్ ఆడటంలో ఆసక్తి లేదని, డబ్బు కోసమే టీ20 లీగులు ఆడతున్నాననే విష ప్రచారం చేశారని వాపోయాడు. ఏ ఆటగాడైనా పేరు సంపాదించడం చాలా కష్టమని తెలిపాడు.
ఇలా బయటకు రావడం మంచిది కాదని, కానీ వీటిని భరించలేకే ప్రజలముందుకు వచ్చానని చెప్పాడు. తనకు మిస్బా, యూనిస్‌తోనే వివాదం జరిగిందని, ఈ క్రమంలోనే అసలేం జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనుకున్నట్లు వివరించాడు. అలాగే న్యూజిలాండ్ పర్యటనకు 35 మందిలో తనను ఎంపిక చేయలేదని, ఒకవేళ నిజంగా తాను టీ20 లీగ్‌ల మీదే ఆసక్తి చూపిస్తే ఈ విషయంపై బాధపడాల్సిన అవసరం తనకు లేదన్నాడు. ఒక సీనియర్ ఆటగాడిగా తనను జట్టులో కొనసాగించాలా వద్దా అనే విషయంపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోయారని చెప్పాడు.
ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, గతేడాది వన్డే ప్రపంచకప్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేశానని, ఇప్పటికీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కొనసాగుతున్నానని అమిర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకుమించి ఏం చేయాలని ప్రశ్నించాడు. తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయనప్పుడు లీగ్ మ్యాచ్‌లు ఆడకుండా ఏం చేయాలని ప్రశ్నించాడు. ఆ రకంగా అయినా తన ప్రతిభను చాటాలనుకున్నట్లు స్పష్టం చేశాడు
- " class="align-text-top noRightClick twitterSection" data="">