మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మన్‌గా కెరీర్ ఆరంభంలో రహానె ఎన్నో ఆశలు రేపాడు. విదేశాల్లో ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లపై తడబాటు లేకుండా బ్యాటింగ్ చేయగల బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ స్థిరత్వమే లేదు. అంచనాలను అందుకోలేకపోయిన అతడు.. తన ప్రతిభకు అతడు న్యాయం చేలేదన్న అభిప్రాయం ఉంది. అన్ని ఫార్మాట్లలో కలిపి దాదాపు 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినా.. ప్రస్తుతం అతడు జట్టుకు భరోసా ఇచ్చే స్థితిలో లేడు. యువ బ్యాట్స్‌మెన్ అవకాశాల కోసం తీవ్రంగా పోటీపడుతున్న తరుణంలో అడపా దడపా ఇన్నింగ్స్‌లతో అతడు ఇంకెంతో కాలం నెట్టుకురాలేడు.
రహానె అంటే..
పుజారా అంటే దుర్భేద్యమైన డిఫెన్స్‌తో నిలబడే టెస్టు స్పెషలిస్టు. విరాట్ కోహ్లీ ఆల్‌రౌండర్. అన్ని ఫార్మాట్లలోనూ మొనగాడు. ఇక రోహిత్ టెస్టుల్లో తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్న పరిమిత ఓవర్ల ఛాంపియన్. మరి రహానె ఏంటి? వెంటనే జవాబు చెప్పడం కష్టం. వాళ్ల లాగే సీనియర్ అయిన అతడి ప్రత్యేకత ఏంటో చెప్పలేం. 13 పర్యటనల్లో జట్టుతో ఉన్న తర్వాత ఎట్టకేలకు 2013లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన అతడు.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆడిన తొలి 13 సిరీస్‌ల్లో అతడు 9 సిరీస్‌ల్లో 50పై సగటు నమోదు చేశాడు. టెస్టు జట్టులో అంతర్భాగమైపోయాడు.
అయితే 2017 శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఘోర వైఫల్యం (సగటు 3.4) కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన (2018)కు టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. విదేశాల్లో మెరుగైన రికార్డున్నా ఎందుకో సెలక్టర్లు అతణ్ని కరుణించలేదు. మరోవైపు రహానె పరిమిత ఓవర్ల కెరీర్‌లోనూ ఎత్తుపల్లాలతో సాగింది. కుర్రాళ్లతో పోటీ పడలేక వన్డే, టీ20 జట్లలో చోటు కోల్పోయాడు. టెస్టుల్లో కీలక ఆటగాడిగా ఎదిగి, వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా అందుకున్నాడు. కానీ ఈ మధ్య ఆ ఫార్మాట్లోనూ అతడి ముద్ర కనిపించడం లేదు. ఒకప్పటి జోరును, స్థిరత్వాన్ని అందుకోలేకపోయాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత 23 టెస్టులు ఆడిన అతడు కేవలం రెండే శతకాలు సాధించాడు. సగటు 40 లోపే.
ఇప్పుడేంటి?
అజింక్య చివరగా వన్డే మ్యాచ్ ఆడి దాదాపు మూడేళ్లు కావస్తోంది. సొంతగడ్డపై ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో సిరీస్ నేపథ్యంలో ఇప్పుడు టెస్టు జట్టులోనూ తన స్థానంపై ప్రశ్నలు తలెత్తొద్దంటే అతడు పరుగుల మోత మోగించాల్సిందే. అందుకే ఆస్ట్రేలియాతో ప్రస్తుత సిరీస్ ఎంతో కీలకం. కోహ్లీ గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించాల్సి రావడం వల్ల అతడి బాధ్యత మరింత పెరిగింది. అత్యుత్తమ ఎలెవన్ లేని జట్టును నడిపించడం రహానెకు పెను సవాలే అనడంలో సందేహం లేదు. కోహ్లీ దూరం కావడం వల్ల బ్యాటింగ్ బలహీనపడగా.. షమీని కోల్పోవడం వల్ల బౌలింగూ బలహీనపడింది. పైగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ రనౌట్‌కు కారణమై మ్యాచ్ భారత్ చేతుల్లోంచి పోవడానికి కారణమయ్యాడన్న విమర్శ కూడా ఉంది. ఇవన్నీ రహానెపై ఒత్తిడి పెంచేవే.
కానీ గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన రెండుసార్లూ అతడికి మంచి మార్కులే పడ్డాయి. 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రహానె తన నాయకత్వ సమర్థతను చాటుకున్నాడు. బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌తో ఆకట్టుకున్నాడు. ఛేదనలో ఎటాకింగ్ ఇన్నింగ్స్‌తో పని తేలిక చేశాడు. అయితే ఇంతకుముందు విడి విడిగా ఒక్కో టెస్టుకు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్‌లు సొంతగడ్డపై జరిగాయి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడలా కాదు.
కేవలం 36 పరుగులకే కుప్పకూలి, సిరీస్‌ను పరాభవంతో ఆరంభించిన భారత జట్టు.. కోహ్లీ, షమీ లాంటి కీలక ఆటగాళ్లను దూరం చేసుకుని తీవ్ర ఇబ్బందికర స్థితిలో ఉంది. మైదానంలోకి దిగడానికి ముందే కూర్పు దగ్గరే రహానెకు సవాలు ఎదురు కానుంది. ఈ మ్యాచ్‌కు మూడు నుంచి అయిదు మార్పులతో బరిలోకి దిగాల్సిన అవసరం పడేలా ఉంది. ఎవరిని ఉంచాలి.. ఎవరిని పక్కన పెట్టాలన్నది అజింక్యకు తలనొప్పే. ఇక ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న జట్టును మైదానంలో నడిపించడం రహానెకు అతి పెద్ద సవాల్. బ్యాటింగ్‌లో అతను చక్కటి ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించాలి. బౌలింగ్ సందర్భంగా కెప్టెన్‌గా తన ముద్రను చూపించాలి. మరి అతనెలా ఆడతాడో.. కెప్టెన్‌గా ఎలాంటి వ్యూహాలతో దిగి, వాటినెలా అమలు చేస్తాడో, ఎలాంటి ఫలితాలు రాబడతాడో?
ఇదీ చూడండి: రైనా అరెస్ట్ కావడానికి కారణం ఇదే!