ప్రస్తుతం టీమ్ఇండియా ఆటగాళ్లలో మార్గదర్శకత్వం చేసే వారు కరవయ్యారని ఇటీవల తెలిపాడు టీమ్ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్. తాజాగా అతడి మాటలతో ఏకీభవించాడు మరో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. భారత జట్టులో రోల్ మోడల్స్ కొరత ఉందని తెలిపాడు.
"విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మినహాయిస్తే టీమ్ఇండియాలో రోల్ మోడల్స్ లేరన్న యువీ మాటలతో ఏకీభవిస్తా. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉండి జూనియర్లకు సలహాలివ్వడం అతి ముఖ్యమైంది. అప్పట్లో ద్రవిడ్, కుంబ్లే, లక్ష్మణ్, గంగూలీ, సచిన్లు యువ క్రికెటర్లకు సలహాలు ఇస్తూ ఉండేవారు. ప్రస్తుతం అలా మార్గదర్శకత్వం చేసే ఆటగాళ్లు భారత జట్టుకు కరవయ్యారు."
-గౌతమ్ గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఇటీవల యువరాజ్ కూడా ఇలాగే స్పందించాడు. అప్పట్లో సీనియర్లలో చాలా క్రమశిక్షణ ఉండేదని అన్నాడు. అప్పుడు సామాజిక మాధ్యమాల్లేవని.. అనవసర విషయాలపైకి మనసు మళ్లేది కూడా కాదని తెలిపాడు. జనాలతో, మీడియాతో ఎలా మాట్లాడాలనే విషయాల్లో కొన్ని పద్ధతులుండేవని చెప్పాడు. కుర్రాళ్లు తప్పు చేస్తే సీనియర్లు చెప్పేవాళ్లని.. ఇప్పుడు జట్టులో కోహ్లీ, రోహిత్ మాత్రమే సీనియర్లని చెప్పుకొచ్చాడు.