టీమ్‌ఇండియాతో తొలి రెండు టెస్టులకు దూరమవ్వడం కాస్త బాధాకరమేనని ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అన్నాడు. విశ్రాంతి తర్వాత పునరాగమనంలో గర్జిస్తానని పేర్కొన్నాడు. సమయం చిక్కడం లేదు కాబట్టే ఇప్పుడు విరామం తీసుకున్నానని వెల్లడించాడు. అతడికి విశ్రాంతినివ్వడం వల్ల సెలక్టర్లపై మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, కెవిన్ పీటర్సన్ తదితరులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
"ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు వాళ్లు నాకు విశ్రాంతినిస్తారు. ప్రస్తుత ప్రపంచం ఇలాగే ఆలోచిస్తోంది. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ఆటగాడు సిరీస్ సాంతం ఆడుతున్న సందర్భాలు తక్కువ. వేసవి, శీతాకాలంలో సుదీర్ఘంగా క్రికెట్ జరిగింది. అన్నింటా ఆడలేం కదా. బయో బుడగ నుంచి బయటకెళ్లి కుటుంబ సభ్యులను చూడాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి తర్వాత నేను రెచ్చిపోతాను. ఇంగ్లాండ్ టెస్టు జట్టులోకి తిరిగి రావడం సంతోషం కలిగించింది. శ్రీలంకపై విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లోకి ప్రవేశించాక భావోద్వేగానికి గురయ్యాను. భారీ స్కోర్లు చేస్తే బాగుండేది. కానీ చేసిన పరుగులతో సంతృప్తిగానే ఉన్నా" అని బెయిర్‌స్టో అన్నాడు.
ఎరుపు బంతి క్రికెట్ ఆడటం తనకిష్టమని చెప్పాడు స్టో. బయో బుడగల మధ్య ఆడటం కాస్త భిన్నంగా, కష్టంగా ఉందని వెల్లడించాడు.
ఇదీ చూడండి : శ్రీలంకపై ఇంగ్లాండ్ గెలుపు- సిరీస్ క్లీన్‌స్వీప్