దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్‌ను హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు బిల్డర్ల మధ్య కుటుంబ గొడవలు పోలీసుల వరకు వెళ్లగా.. విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ రియల్‌స్టేట్ సంస్థ ఎండీ పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలను మోసం చేసినట్లు పేర్కొంటూ.. అదే సంస్థ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. భారతరత్న సచిన్‌ను మోసం చేయడంపై భారత రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాస్తానని వెల్లడించారు. ఇది జాతిని అగౌరవపరచడమే అని ఆయన అన్నారు.
"రావిర్యాల్‌లోని సరస్సు పరివాహక భూములను సంస్థ ఎండీ, సచిన్‌కు అత్యధిక ధరకు అమ్మేశారు. అది ఎఫ్టీఎల్ భూములని మాస్టర్‌కు చెప్పలేదు. ఇప్పటికీ ఆయనకు ఆ విషయం తెలియదు. సచిన్‌కు ఆరు ఎకరాలు, నయనతారకు ఎకరం, రమ్యకృష్ణకు మరో ఎకరం అమ్మేశారు. ఆ ప్రాంతం నిర్మాణాలకు అనువైన ప్రదేశం కాదని.. సరస్సు ప్రాంతమని ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఆ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్స్ కింద అభివృద్ధి చేస్తున్నారు"
-- రియల్‌స్టేట్ సంస్థ డైరెక్టర్
హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో.. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలో రావిర్యాల్ ప్రాంతం ఉంది. ఈ సరస్సు మీద ఆధారపడి దాదాపు 3వేల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. నాలుగు గ్రామాల ప్రజలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వాటన్నింటిని కొంతమంది భూస్వాములు తక్కువ ధరకు కొనేసినట్లు గతంలో పలు వార్తలు వచ్చాయి.