వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మహిళల తొలి టీ 20లో హర్మన్ సేన 23 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 160 పరుగుల లక్ష్యఛేదనను భారత్ ధాటిగా ఆరంభించినా సద్వినియోగపరచుకోలేక పోయింది . స్మృతి మంధాన అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నా... వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది హర్మన్ సేన. లీ మూడు, అమిలీయా రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. భారత్ తరఫున స్మృతి మంధాన(58, 34 బంతుల్లో), జెమీమా రోడ్రిగ్స్(39, 33బంతుల్లో) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.
కివీస్‌లో రాణించిన సోఫీ
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. సోఫీ డివైన్(62, 48బంతుల్లో) అర్ధశతకంతో పాటు బౌలింగ్‌లోనూ ఓ వికెట్ చేజిక్కించుకుంది. కెప్టెన్ అమీ సాట్టర్వెయిట్ 33 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించింది.
ఆరంభంలోనే ఓపెనర్ పునియా వికెట్ కోల్పోయినా... స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. తొలి 6 ఓవర్లలోనే జట్టు స్కోరు 60కు చేరువైంది. గమ్యం దిశగా సాగుతున్న ఈ జంటను అమిలీయా విడదీసింది. పదకొండో ఓవర్లో హానాకు క్యాచ్ ఇచ్చింది స్మృతి. తర్వాతి ఓవర్లోనే జెమీమా పెవిలియన్‌కు చేరింది. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నమోదయ్యింది. ఛేదన దగ్గరపడుతున్న కొద్దీ వరస వికెట్ల కోల్పోయింది టీమిండియా.
మంధాన అర్ధసెంచరీ
ఆరంభం నుంచి ధాటిగా ఆడిన స్మృతి రెండో ఓవర్లో బౌండరీల ఖాతా తెరిచింది. అనంతరం రోస్మేరీ బౌలింగ్ లో రెండు వరస సిక్సర్లతో స్కోరు బోర్డుని ముందుకు నడిపించింది. సోఫీ డివైన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో అర్ధసెంచరీ సాధించింది. 24 బంతుల్లోనే 50 పరుగులు చేసిన స్మృతి కెరీర్లో ఆరో అర్ధశతకాన్ని నమోదుచేసింది.