టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన 5వ భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు షమీ.
395 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన దక్షిణాఫ్రికాను తన స్పెల్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు షమీ. కేవలం 35 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ప్రొటీస్ జట్టు 191 పరుగులకు ఆలౌటైంది.
- 1977లో కర్సాన్ గావ్రీ ఇంగ్లాండ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా గావ్రీ రికార్డు సృష్టించాడు. అయితే ముంబయిలో జరిగిన ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
- 1981లో ఇంగ్లాండ్‌పై కపిల్ దేవ్, మదన్ లాల్ చెరో ఐదు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది.
- 1996లో జవగళ్ శ్రీనాథ్ అహ్మదబాద్ వేదికగా సఫారీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు.
షమీ వేగానికి విరిగిన స్టంప్
ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ పేస్ వేగానికి స్టంప్ విరిగింది. డ్రైవ్ షాట్‌కు ప్రొటీస్ బ్యాట్స్‌మన్ డేన్ పీట్‌ను ఆహ్వానిస్తూ.. షమీ బంతి సంధించగా.. డేన్ మిస్ చేశాడు. అంతే బంతి రివ్వున దూసుకెళ్లి స్టంప్‌ను గిరాటేసింది. అనంతరం స్టంప్ విరిగిందని బీసీసీఐ ఫొటోను షేర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ(176, 127) రెండు శతకాలతో ఆకట్టుకున్నాడు.
ఇదీ చదవండి: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ నెం.1