క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు పిండుకున్న ఓవర్లను తలచుకుంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు రవిశాస్త్రి, గ్యారీ సోబర్స్, యువరాజ్ సింగ్, గిబ్స్. కానీ వీరందరి కంటే ముందే ఒకే ఓవర్‌లో 77 పరుగులు సాధించి ఔరా అనిపించింది ఓ జోడీ. సరిగ్గా 30 ఏళ్ల క్రితం.. అంటే 1990 ఫిబ్రవరి 20న న్యూజిలాండ్‌లోని ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
టైటిల్ పోరులో
1990లో వెల్లింగ్టన్, కాంటర్‌బరీ జట్ల మధ్య ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆ సీజన్‌లో వెల్లింగ్టన్‌కు అదే చివరి మ్యాచ్. టైటిల్ సాధించాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఫిబ్రవరి 20న ఆఖరి రోజు కావడం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు.. కాంటర్‌బరీకి 59 ఓవర్లలో 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఛేదనలో ఆ జట్టు 108 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఆ సమయంలో బ్యాటింగ్ చేసిన ఎల్‌కే జర్మన్(160 నాటౌట్), రోజర్ ఫోర్డ్(14 నాటౌట్)మ్యాచ్‌ను డ్రాగా ముగిద్దామనుకొని వికెట్ నష్టపోకుండా జాగ్రత్త పడ్డారు. జట్టు స్కోరు 196/8కు చేరడం వల్ల వెల్లింగ్టన్ కెప్టెన్ మెక్ స్వీనే ఒక దురాలోచన చేశాడు.
17 నోబాల్స్ వేసినా మ్యాచ్ 'డ్రా'
కాంటర్‌బరీ గెలవడానికి 2 ఓవర్లలో 95 పరుగులు చేయాలి. మ్యాచ్‌ను డ్రా చేసుకోడానికి ప్రయత్నిస్తున్న ఆ జోడీని ఔట్ చేయాలని భావించిన మెక్ స్వీనే.. బంతిని బెర్ట్‌వాన్స్ అనే బ్యాట్స్‌మన్ చేతికిచ్చాడు. ఈ ఓవర్‌లో ఎక్కువ పరుగులిచ్చి ప్రత్యర్థి జట్టును విజయానికి చేరువ చేస్తే.. అప్పుడు బ్యాట్స్‌మెన్ తొందరపడి వికెట్లు కోల్పోతారని పన్నాగం పన్నాడు. జర్మన్ ఆ ఓవర్‌కు ముందు 75 పరుగులతో కొనసాగుతున్నాడు.
బెర్ట్‌వాన్స్ బంతిని తీసుకొని మొత్తం 22 బంతులేశాడు. అందులో 17 నోబాల్స్. అంపైర్.. ఓ బంతిని లెక్కించడంలో పొరపాటు పడ్డాడు. ఈ క్రమంలో జర్మన్ శతకంతో చెలరేగి ఎనిమిది సిక్సర్లు, ఐదు ఫోర్లు బాదాడు. ఫలితంగా ఈ ఓవర్‌లో మొత్తం 77 పరుగులొచ్చాయి. చివరి ఓవర్‌లో కాంటర్‌బరీకి 18 పరుగులు అవసరమయ్యాయి. ఇవాన్ గ్రే వేసిన ఆ ఓవర్‌లో.. జర్మన్ 5 బంతుల్లో 17 పరుగులు చేశాడు. చివరి బంతికి సింగిల్ తీస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. అయితే, రోజర్ ఫోర్డ్ ఆడిన ఆ బంతిని అడ్డుకోవడం వల్ల మ్యాచ్ డ్రాగా ముగిసింది.
చరిత్రకెక్కని రికార్డు
వెల్లింగ్టన్ కెప్టెన్ వ్యూహం ఫలించకపోయినా ఆ జట్టే విజేతగా నిలవడం విశేషం. ఈ టోర్నీలో మిగతా జట్లు వెల్లింగ్టన్ కంటే తక్కువ పాయింట్లు తెచ్చుకోవడం వల్ల, ఆ జట్టే టైటిల్ సాధించింది. అయితే, బెర్ట్‌వాన్స్ వేసిన స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు నాలుగు మైనస్ పాయింట్లు మూటగట్టుకుంది. కొన్ని కారణాల వల్ల బెర్ట్‌వాన్స్ వేసిన ఈ ఓవర్ రికార్డులకు ఎక్కలేదు.