ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయాలన్న ఆరాటంలోనో, పరుగులు నియంత్రించాలన్న ఆలోచనలోనో ఎక్కువగా క్రీజు దాటుతుంటారు బౌలర్లు. ఒక్కోసారి లయ కోల్పోయినప్పుడు తప్పిదాలు జరుగుతుంటాయి. దాన్నే క్రికెట్ పరిభాషలో ఫ్రంట్ ఫుట్ నోబాల్ అంటారు. దీని వల్ల జట్టుకు ఒక రన్ పెనాల్టీ పడగా.. దాన్ని ప్రత్యర్థి జట్టు స్కోరుకు కలుపుతారు. తర్వాత కాలంలో నోబాల్‌కు ఎక్స్ట్రా డెలివరీ రూపంలో ఫ్రీ హిట్ అనేది యాడ్ చేశారు. ఈ బంతిని బ్యాట్స్మన్లు ఎంత బలంగా బాదుతారంటే.. కచ్చితంగా బౌండరీకి తరలించాలనే వారు దృష్టిపెడతారు.
నోబాల్ వల్ల కొన్నిసార్లు మ్యాచ్ స్వరూపాలే మారిపోయాయి. ఆ డేంజర్ బంతికి ఫీల్డింగ్ జట్లు ఎంతో మూల్యం చెల్లించుకున్నాయి. మరి ఆ తరహా బంతిని కెరీర్లో ఒక్కసారి వేయని ఆటగాళ్లు ఉన్నారంటే నమ్ముతారా.? ఏకంగా వందల కొద్ది మ్యాచ్‌లు, ఏళ్ల కెరీర్ వాళ్ల సొంతం. అందుకే ఆ దిగ్గజాలతో ఓ టాప్-5 జాబితా రూపొందిస్తే.. ఓ భారత క్రికెటర్ అగ్రస్థానంలో నిలవడం మరీ విశేషం.
5.లాన్స్ గిబ్స్...
ఈ వెస్టిండీస్ దిగ్గజ బౌలర్‌కు భారతీయ గడ్డపై మంచి రికార్డు ఉంది. భారత పిచ్‌లపై ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు కైవసం చేసుకున్నాడు. టెస్టుల్లో 300 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్, క్రికెట్ హిస్టరీలో ఆ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్. విండీస్ తరఫున 79 టెస్టులు, 3 వన్డేలు ఆడిన లాన్స్ గిబ్స్.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయలేదు. కెరీర్లో 311 వికెట్లు సాధించాడు. అలా నోబాల్ వేయని క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇందులో చోటు పొందిన ఏకైక స్పిన్నర్‌గానూ ఘనత సాధించాడు.
4. డెన్నిస్ లిల్లీ..
ఆస్ట్రేలియాకు చెందిన డెన్నిస్ లిల్లీ.. వన్డే కెరీర్లో 63 మ్యాచ్‌లు ఆడి 103 వికెట్లు తీసుకున్నాడు. బౌలింగ్ సగటు 20.83గా ఉంది. దిగ్గజాల్లో ఒకరైన లిల్లీ.. టెస్టుల్లో 350 వికెట్ల మార్కు అందుకున్నాడు. 1971లో కెరీర్ ప్రారంభించిన ఆయన.. 1984లో పలు ఆరోగ్య కారణాల వల్ల కెరీర్‌కు అర్ధాంతరంగా ముగింపు పలికాడు. అయితే 13 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 70 టెస్టుల్లోనే 355 వికెట్లు సాధించాడు. సగటు 23.92గా ఉంది. 23 సార్లు 5 వికెట్లు, 7సార్లు 10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ కంగారూ బౌలర్ బౌలింగ్ వేసినప్పుడు ఒక్కసారి గీత దాటి నోబాల్ వేయలేదు.
3. ఇయాన్ బోథమ్..
అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ బోథమ్. క్రికెట్ గాడ్ సచిన్ వంటి ప్లేయర్ తన అత్యుత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో బోథమ్ పేరును చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. తన జట్టుకు ఇతడు బ్యాట్‌తోనూ, బంతితోనూ మరపురాని ఎన్నో విజయాలను అందించాడు. మ్యాచ్ విన్నర్‌గా పేరున్న ఈయన టెస్టులు, వన్డేల్లోనూ సత్తా చాటాడు. 15 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 102 టెస్టులు ఆడి.. 28.40 సగటుతో 383 వికెట్లు తీశాడు. 33.54 సగటుతో 5,200 పరుగులు చేశాడు.
116 వన్డేల్లో బరిలోకి దిగిన బోథమ్.. 2,113 రన్స్ సాధించడమే కాకుండా 143 వికెట్లు తీసుకున్నాడు. సగటు 28.54గా ఉంది. సుదీర్ఘ కెరీర్లో ఒక్కసారి ఆరు బంతులకు మించి బౌలింగ్ వేయలేదంటే అర్థం చేసుకోవచ్చు ఆయన నిబద్ధత. అందుకే ఈ జాబితాలో టాప్-3లో చోటు దక్కించుకున్నాడు.
2.ఇమ్రాన్ ఖాన్...
క్రికెటర్‌గా ఎనలేని పేరు తెచ్చుకుని ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఈ పాక్ క్రికెటర్.. ఆ దేశానికి 1992 ప్రపంచకప్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో 72 పరుగులు చేసి 1/43తో బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. దాయాది దేశానికి కప్పు తెచ్చిన ఏకైక కెప్టెన్ ఇతడే. సారథిగా తన జట్టును విజయవంతంగా నడిపించగలిగాడు. అందుకే అతడిని ఆ దేశ క్రికెట్లో ఓ శకంగా అభివర్ణిస్తారు. 1982లో పాక్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్.. 1987లో భారత్‌కు వచ్చి స్వదేశీ గడ్డపైనే 'మెన్ ఇన్ బ్లూ'ను ఓడించాడు.
ఇమ్రాన్ ఖాన్ 88 టెస్టులు ఆడి 3,807 పరుగులు, 362 వికెట్లు సాధించాడు. 175 వన్డేల్లో 182 వికెట్లు, 3,709 పరుగులు చేశాడు. క్రికెట్ చరిత్రలో నోబాల్ వేయని ఆటగాడిగానూ ఘనత సాధించాడు.
1.కపిల్‌దేవ్...
భారత మాజీ సారథి, దిగ్గజ ఆల్‌రౌండర్ అయిన కపిల్‌దేవ్.. తన కెరీర్లో ఒక్కసారి నోబాల్ వేయలేదు. ప్రత్యర్థులకు తనదైన బౌలింగ్, బ్యాటింగ్‌తో దడపుట్టించే ఈ హరియాణా హారికేన్.. ఇప్పటికీ ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్‌లోనే ఉంటాడు. భారత క్రికెట్ రూపురేఖలు మార్చి, దేశ గౌరవాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఆటగాడు కపిల్. ఆయన రిటైర్మెంట్ ప్రకటించి ఎన్నో ఏళ్లు గడిచినా దేశ క్రికెట్లో ఇప్పటికీ ఈయన స్థానానికి సరైన ఆటగాడు దొరకలేదంటే.. ఆయన స్థాయి అసాధారణమని చెప్పొచ్చు.
1978లో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన కపిల్.. 1983 వన్డే ప్రపంచకప్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. జింబాబ్వేతో కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో 138 బంతుల్లో 175 పరుగులు చేసి విశ్వరూపం చూపించాడు. 17/ 5 వద్ద ఉన్న జట్టు స్కోరు 266/8 వరకు వెళ్లిందంటే కపిల్ ఆట గురించి అర్థం చేసుకోవచ్చు. కేవలం టెయిలెండర్లతోనే ప్రత్యర్థి జట్టును ఆటాడేసుకున్నాడు. అందుకే ఈ ఇన్నింగ్స్‌ను వన్డేల్లో అత్యుత్తమైన ప్రదర్శనల్లో ఒకటిగా భావిస్తారు. వెస్టిండీస్ జట్టును లార్డ్స్‌లో మట్టికరిపించి తొలిసారి భారత్‌కు ప్రపంచకప్ అందించిన సారథిగా ఘనత సాధించాడు.
131 టెస్టుల్లో 5,248 పరుగులు, 225 వన్డేల్లో 3,783 రన్స్ చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 434 వికెట్లు, వన్డేల్లో 253 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 5వేల పైచిలుకు పరుగులు చేయడమే కాకుండా 400 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు కపిల్ కావడం విశేషం. 16 ఏళ్ల కెరీర్లో ఒక్క నోబాల్ వేయని ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు.
ఇక్కడ ఉన్న అందరు క్రికెటర్లలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడి, ఎక్కువ పరుగులు, వికెట్లు సాధించి.. ఒక్క నోబాల్ వేయలేదు కాబట్టే ఈ జాబితాలో కపిల్ టాప్-1గా నిలిచాడు.