ఆటలో గెలుపోటములు సహజం. గెలిస్తే ప్రశంసలు, ఓడితే విమర్శలూ మామూలే. నీదైన రోజున ఎంతటి జట్టుపైన అయినా అద్భుతాలు చేయవచ్చు. విజయంతో రికార్డులూ సృష్టించొచ్చు. కానీ తర్వాత ఓడితే ప్రశంసించిన నోళ్లే మళ్లీ తిట్టడం మొదలెడతాయి. ప్రస్తుతం టీమ్ఇండియా ఎదుర్కొంటున్న విమర్శలు ఇందుకు నిదర్శనం. గత నెలలో ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే మట్టికరిపించి టెస్టు సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది భారత జట్టు. కానీ మంగళవారం ఇంగ్లాండ్‌తో స్వదేశంలో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలై విమర్శలు మూటగట్టుకుంది. కొందరు జట్టు సెలక్షన్ పైనా మండిపడితే, మరికొందరు పిచ్ బాగాలేదని, ఆటగాళ్లలో కసి కనిపించలేదని అన్నారు. ఏదేమైనా ఓటమికి కారణాలు విశ్లేషించుకోవాల్సిందే. ఇవన్నీ మరిచి రెండో టెస్టుపై దృష్టిపెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో కోహ్లీసేన జట్టులో ఎలాంటి మార్పులు చేస్తే ఫలితం సానుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.
నదీమ్ స్థానంలో కుల్దీప్
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు లెగ్ స్పిన్నర్ షహబాజ్ నదీమ్‌కు సుదీర్ఘ ఫార్మాట్లో రెండో మ్యాచ్ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్లే ఇతడు సరైన ప్రదర్శన చేయలేదని విశ్లేషకుల అభిప్రాయం. కానీ దేశం కోసం ఆడే సమయంలో అవన్నీ పక్కనపెట్టి మెరుగైన ప్రదర్శన పైనే దృష్టిపెట్టాలి. జట్టు గెలుపు కోసం పోరాడాలి. ఈ మ్యాచ్‌లో నదీమ్ ప్రదర్శన చూసుకుంటే 59 ఓవర్లు వేసి 233 పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. కానీ ఇదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ జాక్ లీచ్ కాస్త మెరుగ్గా ఆడాడు. ఇతడు 50 ఓవర్లు వేసి 181 పరుగులు సమర్పించుకుని ఆరు వికెట్లు తీసి జట్టు విజయానికి కృషి చేశాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, పుజారాల వికెట్లు తీసి జట్టుపై ఒత్తిడి పెంచాడు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో ఇతడి స్థానంలో కుల్దీప్ను తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొదటి మ్యాచ్ కోసం జట్టును ప్రకటించిన సమయంలోనే కుల్దీప్ లేకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ నదీమ్ విఫలమవడం వల్ల అందరి దృష్టి మరోసారి కుల్దీప్పై పడింది. రెండో మ్యాచ్‌లో అతడిని తీసుకోవాలన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కుల్దీప్ ఆడిన చివరి టెస్టులో 5 వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో రెండో మ్యాచ్‌లో నదీమ్ స్థానంలో కుల్దీప్కు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లోనే కాక ఇంతకుముందు టెస్టుల్లోనూ హిట్‌మ్యాన్ ప్రదర్శన అంతంతమాత్రమే ఉంది. గత 8 ఇన్నింగ్స్‌ల్లో ఆరింటిలో కేవలం 30 లోపు పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. దీంతో రోహిత్ కంటే కాస్త మెరుగ్గా ఉన్న మయాంక్‌ను ఓపెనర్‌గా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్వదేశంలో రోహిత్ శర్మ 22 ఇన్నింగ్స్‌లో 79 సగటుతో 6 సెంచరీలు సాధించాడు.
స్వదేశంలో ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించాడు మయాంక్ అగర్వాల్. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండటం గమనార్హం. ఇతడి సగటు 99.50గా ఉంది. దీంతో రెండో మ్యాచ్‌లో మయాంక్‌ను తీసుకోవాలన్న డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి. కానీ సారథి కోహ్లీ మాత్రం ఓపెనర్ల విషయంలో చాలా స్పష్టతతో ఉన్నాడు. రోహిత్, గిల్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనను ఇటీవలే వెల్లడించాడు. దీంతో రెండో మ్యాచ్‌లో రోహిత్ స్థానం ఖాయంలా కనిపిస్తోంది. కానీ మయాంక్ పేరును పరిశీలించే ఆలోచన కూడా ఉంది.
రహానే స్థానంలో కేఎల్ రాహుల్
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బ్యాట్స్‌మన్‌గానే కాక కెప్టెన్‌గానూ జట్టును ముందుండి నడిపించి సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు అజింక్యా రహానే. మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కూడా సాధించాడు. కానీ గత 15 ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క శతకం మాత్రమే సాధించడం గమనార్హం. గత 14 మ్యాచ్‌ల్లో (శతకాన్ని మినహాయిస్తే) ఇతడి అత్యధిక స్కోర్ 46. ఇందులో 6 సార్లు కేవలం 10 పరుగుల కంటే తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. దీంతో రహానే కంటే కాస్త మెరుగైన గణాంకాలు ఉన్న రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
స్వదేశంలో రహానే సగటు 37.35 ఉండగా, రాహుల్ సగటు 44.25గా ఉంది. అలాగే ఆడిన 22 ఇన్నింగ్స్‌ల్లో 9 సార్లు అర్ధశతకం సాధించాడు. కానీ రహానే 44 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 11 అర్ధశతకాలు మాత్రమే చేశాడు. ఈ గణాంకాలను పరిశీలిస్తే రహానే కంటే రాహుల్‌కు కాస్త ఎక్కువ స్కోప్ ఉంది. కానీ అనుభవం పరంగా, జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న కారణంగా రహానేపై వేటు వేయడం కాస్త కష్టమైన పనే.