టీమిండియాతో జరుగుతోన్న రెండో వన్డేలో కివీస్ జట్టు మంచి స్కోరు సాధించింది. కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత బౌలర్లు పట్టు బిగించినా... ఆఖర్లో పరుగులిచ్చుకున్నారు. ఫలితంగా కివీస్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లో గప్తిల్, నికోలస్ ఆకట్టుకోగా.. ఆఖర్లో టేలర్ చెలరేగాడు.
గప్తిల్ అర్ధశతకం...
చాలా రోజులుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ఎట్టకేలకు 11 ఇన్నింగ్స్‌ల తర్వాత హాఫ్ సెంచరీ సాధించాడు. కెరీర్లో 36వ వన్డే అర్ధశతకం నమోదుచేసుకున్నాడు. చివరికి 79 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఇతడికి మరో ఓపెనర్ హెన్రీ నికోల్స్ (41) మంచి తోడ్పాటునిచ్చాడు. ఆరంభంలో అదరగొట్టిన కివీస్ బ్యాట్స్‌మెన్.. తర్వాత చేతులెత్తేశారు. భారత బౌలర్లు కీలక విరామాల్లో వికెట్లు తీసి పరుగులు నియంత్రించారు. మొదట్లో నిదానంగా ఆడిన టేలర్ (73*) ఆఖర్లో చెలరేగి మరో హాఫ్ సెంచరీ సాధించాడు.
భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు సాధించాడు. శార్దూల్ 2, జడేజా ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు. సైనీ పొదుపుగా బౌలింగ్ చేశాడు.