Commonwealth Games: ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పోటీల్లో ఒకటైన కామన్వెల్త్ క్రీడల సంబరం మొదలైంది. 22వ కామన్వెల్త్ గేమ్స్ ఆరంభ వేడుకలు గురువారం అట్టహాసంగా సాగాయి. వేల మంది క్రీడాభిమానులు, ప్రేక్షకుల మధ్య 72 దేశాల క్రీడాకారులు జాతీయ పతాకాల్ని ధరించి మార్చ్ఫాస్ట్లో పాల్గొన్నారు. శుక్రవారం బర్మింగ్‌హామ్ వేదికగా పోటీలు ప్రారంభకానున్నాయి. 1934 నుంచి జరుగుతోన్న క్రీడల్లో కేవలం మూడు సార్లు మాత్రమే భారత్ పాల్గొనలేదు. అయితే ఇప్పటి వరకు కామన్వెల్త్ పోటీల్లో భారత్ ఎన్ని పతకాలను సొంతం చేసుకుంది? గతసారి ఎన్ని వచ్చాయి? తదితర విశేషాలను ఓ సారి తెలుసుకుందాం..
ఓవరాల్‌గా నాలుగో స్థానంలో.. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటి వరకు భారత్ 503 పతకాలను సాధించి ఓవరాల్‌గా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అందులో 181 స్వర్ణం, 173 రజతం, 149 కాంస్య పతకాలున్నాయి. అత్యధికంగా 2010 సీజన్ పోటీల్లో 101 పతకాలను (స్వర్ణం 38, రజతం 27, కాంస్యం 36) సొంతం చేసుకుంది. దీంతో రెండో ర్యాంకులో నిలిచింది. అప్పుడు భారత్ ఆతిథ్యం ఇవ్వడం విశేషం. అయితే ఆసీస్ వేదికగా 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ భారత్ ఫర్వాలేదనిపించింది. 26 స్వర్ణాలు, 20 సిల్వర్, 20 కాంస్య పతకాలతో మొత్తం 66 మెడల్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో మూడో స్థానంతో టోర్నీని ముగించింది.
అప్పుడు కాపాడిన షూటింగ్
2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషులు 113 మంది, మహిళలు 103 మంది పాల్గొన్నారు. భారత్ 26 స్వర్ణాలను గెలిచిందంటే కారణం షూటింగ్.. ఆ తర్వాత వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్. షూటింగ్‌లో ఏడు, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్‌లో ఐదేసి బంగారు పతకాలు వచ్చాయి. ఆ తర్వాత టేబుల్ టెన్నిస్ (3), బాక్సింగ్ (3), బ్యాడ్మింటన్ (2), అథ్లెటిక్స్ (1) నిలిచాయి. ఇక షూటింగ్‌లో నాలుగు.. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ పోటీల్లో మూడేసి.. టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, స్క్వాష్ గేముల్లో రెండేసి.. రజతాలు దక్కాయి. 2018 సీజన్‌లో అథ్లెటిక్స్‌లో కేవలం ఒకే ఒక్క స్వర్ణం, రజతం, కాంస్య పతకాలను సాధించడం గమనార్హం.
2018లో బంగారు పతక విజేతలు వీరే..
మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), సంజితా చాను (వెయిట్‌లిఫ్టింగ్), రాగాల వెంకట రాహుల్(వెయిట్‌లిఫ్టింగ్), సతీశ్ శివలింగం (వెయిట్‌లిఫ్టింగ్), పూనమ్ యాదవ్ (వెయిట్‌లిఫ్టింగ్), మను బాకర్ (షూటింగ్), మేరీకోమ్ (బాక్సింగ్) టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్, జితు రాయ్ (షూటింగ్), టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్, బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్, హీనా సిద్ధు (షూటింగ్), శ్రేయాసి సింగ్(షూటింగ్), రాహుల్ అవారే (రెజ్లింగ్), తేజస్విని సావంత్ (షూటింగ్), బజ్‌రంగ్ పూనియా (రెజ్లింగ్), సంజీవ్ రాజ్‌పుత్ (షూటింగ్), గౌరవ్ సోలంకి (బాక్సింగ్), నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), సుమిత్ మాలిక్ (రెజ్లింగ్), వినేశ్ ఫోగట్ (రెజ్లింగ్), మనికా బాత్రా (టేబుల్ టెన్నిస్), వికాస్ కృష్ణన్ యాదవ్ (బాక్సింగ్), సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్) స్వర్ణ పతకాలను సాధించారు.
ఈసారి నిరాశే..
ప్రస్తుతం బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ నుంచి 210 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో 106 మంది పురుష, 104 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. అయితే బంగారు పతకం సాధించి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడని భావించిన ఒలిపింక్ పతక విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా మెగా టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. అలానే గత కామన్వెల్త్‌లో స్వర్ణం సొంతం చేసుకున్న సైనా నెహ్వాల్ పాల్గొనడం లేదు. ఇక బ్యాడ్మింటన్ ఆశలన్నీ పీవీ సింధుతోపాటు లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్‌పైనే. సింగపూర్ ఓపెన్‌ను గెలిచి మంచి ఊపు మీదున్న పీవీ సింధు ఎలాగైనా స్వర్ణ పతకం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. గత సీజన్‌లో కేవలం ఒక్కో పతకం మాత్రమే సాధించిన అథ్లెటిక్స్ విభాగంలో ఈసారి కూడా పెద్దగా పతకాలు వచ్చే అవకాశాలు లేవు. ద్యుతీ చంద్, హిమ దాస్ ట్రాక్ అండ్ రోడ్ ఈవెంట్‌లో పతకం సాధిస్తే అద్భుతమనే చెప్పాలి. బాక్సింగ్‌లో మేరీ కోమ్ లేకపోయినా నిఖత్ జరీన్ ఆ స్థానాన్ని భర్తీ చేయగలదు. అలానే లవ్లీనాపైనా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే షూటింగ్ లేకపోవడం పెద్ద లోటు. గతంలో అత్యధికంగా 16 పతకాలు ఈ విభాగంలోనే వచ్చాయి.
క్రికెట్‌లో పతకం తెస్తారా..?
తొలిసారి మహిళా క్రికెట్‌కు కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రాతినిధ్యం దక్కింది. ఆస్ట్రేలియా, బార్బోడస్, పాకిస్థాన్ ఉన్న గ్రూప్‌లో భారత్ ఆడనుంది. ఈ క్రమంలో సెమీస్‌కు దూసుకెళ్లడం టీమ్‌ఇండియాకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే గ్రూప్ స్టేజ్‌లో ఆసీస్‌తోనే కాస్త ప్రమాదకరం. ఇక సెమీస్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి మేటి జట్లతో తలపడాల్సి ఉంటుంది. కాబట్టి నాకౌట్ దశలో భారత్ చెమట్చోడాల్సిందే. లేకపోతే అరుదైన అవకాశాన్ని చేజార్చుకున్నట్లవుతుంది. జట్టుపరంగా హర్మన్, స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్ వంటి యువ క్రికెటర్లు ఉన్నారు. వీరికి తోడుగా సీనియర్ బౌలర్ ఝులన్ గోస్వామి అండగా ఉంది. అయితే టాప్‌ఆర్డర్ రాణిస్తే మాత్రం భారత్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు.
మరోసారి వాటిపైనే ఆశలు..
గత కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యధికంగా షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ పోటీల్లో ఎక్కువ పతకాలు వచ్చాయి. అయితే ఈసారి షూటింగ్ లేకపోవడం భారత్‌కు తీరని లోటు. మిగిలిన విభాగాల్లో పతకాలు సాధించే అవకాశాలు భారీగానే ఉన్నాయి. రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా, బజ్‌రంగ్ పునియా, దీపక్ పునియా, వినేశ్ ఫోగట్, అన్షు మాలిక్, సాక్షి మాలిక్, పూజా సిహాగ్ తదితరులు పతకం తెచ్చే క్రీడాకారుల జాబితాలో ఉన్నారు. ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పురుషుల, మహిళల హాకీ జట్లు ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుదలగా ఉన్నాయి. స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి విభాగాల్లో పతకాలు దక్కడం అంత సులువేం కాదు.
ఇవీ చదవండి: గ్రాండ్‌గా కామన్వెల్త్ గేమ్స్ ఆరంభ వేడుక.. హైలైట్‌గా డ్యూరన్ లైవ్ షో
కామన్వెల్త్ క్రీడలు వచ్చేశాయ్.. పోటీలే పోటీలు.. పతకాల వేటలో భారత అథ్లెట్లు!