Gautam gambhir on kohli: టీమ్‌ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ ఎవరికీ జన్మహక్కు కాదని పేర్కొన్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల పగ్గాలు వదిలేసిన కోహ్లీ.. తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు.
‘కెప్టెన్సీ అనేది ఎవరికీ జన్మహక్కు కాదు. మహేంద్ర సింగ్ ధోనిలాంటి దిగ్గజ ఆటగాడి నుంచి విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు, నాలుగు ఐపీఎల్ కప్పులు గెలుచుకున్న ధోని ఎలాంటి భేషజాలు లేకుండా.. కోహ్లీ సారథ్యంలో ఆడాడు. కోహ్లీ నిర్ణయంతో టాస్ వేయడం, మైదానంలో ఫీల్డర్లను మోహరించే విషయంలో మాత్రమే మార్పు వస్తుంది. అంతకు మించిన పెద్ద మార్పులేం జట్టులో కనిపించవు. అతడిలోని ఉత్సాహం, ఆటపట్ల ఉన్న అంకిత భావంలో ఎలాంటి మార్పు ఉండదనుకుంటున్నాను. ఎందుకంటే, ఏ ఆటగాడికైనా దేశం కోసం ఆడటం కన్నా మించిన గొప్ప గౌరవం మరొకటి ఉండదు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టు కోసం శ్రమించాడు. విజయం కోసం కలలు కన్నాడు. ప్రస్తుతం అతడు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి.. జట్టు కోసం పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగేవాడు. ప్రస్తుతం కూడా అదే స్థానంలో ఆడతాడు. జట్టులోకి ఎంతమంది ఆటగాళ్లు వచ్చినా అతడి స్థానంలో ఎలాంటి మార్పూ ఉండదు’ అని గంభీర్ పేర్కొన్నాడు.
కోహ్లీ అహాన్ని పక్కన పెట్టాలి
టెస్టు క్రికెట్ కెప్టెన్‌గా తప్పుకుంటూ కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఆటగాడు కపిల్ దేవ్ స్వాగతించాడు. ‘టీ20 కెప్టెన్సీ వదులుకున్నప్పటి నుంచి కోహ్లీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మనమంతా అతడికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో అతడు కొంచెం గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కెప్టెన్సీని కూడా సరిగా ఆస్వాదించలేకపోతున్నాడు. మరికొంత కాలం స్వేచ్ఛగా క్రికెట్ ఆడేందుకే కోహ్లీ ఇలా చేశాడనిపిస్తోంది. బాగా ఆలోచించే ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నాడనుకుంటున్నాను. దిగ్గజ ఆటగాడైన సునీల్ గావస్కర్ కూడా ఎలాంటి అహం లేకుండా నా కెప్టెన్సీలో ఆడాడు. నేను కూడా అలాంటివేమీ పట్టించుకోకుండా కృష్ణమాచారి శ్రీకాంత్, అజారుద్దీన్ నాయకత్వంలో ఆడాను. విరాట్ కూడా అహాన్ని పక్కనపెట్టి యువ క్రికెటర్లతో ఆడాలి. అది భారత క్రికెట్‌కు ఎంతో అవసరం. కొత్త కెప్టెన్, యువ ఆటగాళ్లకు మార్గ నిర్దేశం చేయాలి. కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడి సేవలను మేము కోల్పోవాలనుకోవట్లేదు’ అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: కెప్టెన్సీ అప్పగిస్తే గొప్ప గౌరవంగా భావిస్తా: బుమ్రా