కొవిడ్‌తో పోరాడుతున్న భారత్‌కు పలువురు క్రికెటర్లు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ రూ.37 లక్షల సాయం అందించగా.. తాజాగా మరో మాజీ ఆసీస్ క్రికెటర్ బ్రెట్ లీ దాతృత్వం చాటుకున్నాడు. దేశంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం.. ఒక బిట్‌కాయిన్ క్రిప్టో కరెన్సీ (భారత కరెన్సీలో దాదాపు 41 లక్షల రూపాయలు) ఆర్థిక సాయంగా ప్రకటించాడు.
"భారత్ ఎల్లప్పుడూ నాకు రెండో స్వదేశం లాంటిది. నా క్రికెట్ జీవితంలో, రిటైర్మెంట్ తర్వాత.. అక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయత మర్చిపోలేనిది. భారత్ అంటే నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. అటువంటి దేశం ఇప్పుడు కొవిడ్ ధాటికి వణికిపోతోందనే విషయం నన్ను కలిచివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు అండగా ఉండాలనిపించింది. అందుకే ఒక బిట్‌కాయిన్ క్రిప్టో కరెన్సీ(భారత కరెన్సీలో దాదాపు రూ.41 లక్షలు) సాయం కింద ఇస్తున్నాను. దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని కోరుతున్నా."
-బ్రెట్ లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.
ఇదీ చదవండి: 'మీరు సజావుగా వెళ్లాకే.. లీగ్ ముగిసినట్లు భావిస్తాం'
"ఈ కఠిన పరిస్థితుల్లో ముందుండి సేవ చేస్తున్న ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు నా కృతజ్ఞతలు. జాగ్రత్తగా ఉంటూ కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని ప్రతి ఒక్కరికీ నా విన్నపం. మాస్క్‌ను తప్పనిసరిగా ధరించండి. సామాజిక దూరం పాటించండి. భారత్ కోసం ముందుకు వచ్చిన కమిన్స్‌కు అభినందనలు" అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: హాకీ అంపైర్స్ మేనేజర్ వీరేంద్ర సింగ్ మృతి