టీమ్‌ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో అయితే ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లోనూ సరైన ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. ఈ క్రమంలోనే మిగిలిన రెండు టెస్టులకు టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ.. రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా తొలగించింది. కేవలం ఆటగాడిగా టీమ్‌లో కొనసాగించింది.
ఈ క్రమంలోనే రాహుల్‌కు జట్టులో చోటు ప్రశార్థకంగా మారింది. మిగిలిన మ్యాచ్‌ల్లో రాహుల్‌ను తుది జట్టు నుంచి తప్పించేందుకే వైస్ కెప్టెన్ బాధ్యతలను తొలిగించారని ప్రచారం సాగుతోంది. మరోవైపు వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌ను తీసేసి అతడి స్థానంలో సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్‌పై వచ్చిన విమర్శల గురించి మాట్లాడాడు భారత మాజీ కెప్టెన్ గంగూలీ. స్వదేశీ పిచ్‌లపై రాణించకపోతే ఏ ప్లేయర్ అయినా విమర్శలను ఎదుర్కోవాల్సిందేనని పేర్కొన్నాడు.
"టీమ్‌ఇండియా ప్లేయర్స్ భారత్‌లో పరుగులు చేయకపోతే కచ్చితంగా విమర్శలు వస్తాయి. కేఎల్ రాహుల్ ఒక్కడే కాదు. గతంలో చాలామంది ప్లేయర్స్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆటగాళ్లపై చాలా ఒత్తిడితోపాటు ఎక్కువ ఫోకస్, శ్రద్ధ ఉంది. టీమ్ మేనేజ్‌మెంట్ రాహుల్‌ను జట్టుకు ఇంపార్టెంట్ ప్లేయర్‌గా భావిస్తోంది. ఫైనల్‌గా కోచ్, కెప్టెన్ ఏమనుకుంటున్నారనేది ముఖ్యం. రాహుల్ టాలెంట్ ప్లేయరే. కానీ, భారతదేశం తరఫున ఆడుతున్నప్పుడు అతడు మరింత బాగా ఆడాలనే ఫ్యాన్స్ ఆశిస్తారు. ఎందుకంటే ఇతర ప్లేయర్స్ సెట్ చేసిన ప్రమాణాలు అత్యంత ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫెయిల్ అయినప్పుడు కచ్చితంగా విమర్శలు వస్తాయి. రాహుల్‌కు తిరిగి పుంజుకునే సత్తా ఉంది. నేను నమ్ముతున్నాను. అతడు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని భారీ స్కోర్లు చేయడానికి ట్రై చేయాలి" అని దాదా పేర్కొన్నాడు.
ఇక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ విషయానికొస్తే.. ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నీలోని తొలి రెండు టెస్టుల్లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచుల ఈ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో మ్యాచ్ మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా ప్రారంభంకానుంది.
ఇదీ చూడండి: కయ్యాలమారి అలీసా హీలి.. టీమ్ఇండియాపై ఎప్పుడూ ఇలానే!