ICC Jay Shah: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో కీలక పదవి భారత్‌కు దక్కింది. ప్రస్తుతం ఐసీసీలో ఛైర్మన్ సహా వివిధ కమిటీలకు అధినేతల ఎంపిక కొనసాగుతోంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశం ఏర్పాటైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్లే మళ్లీ ఎన్నికయ్యారు. అదే సమయంలో అత్యంత కీలకమైన ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా జై షా ఎన్నికయ్యారు.
ఐసీసీ నిర్వహించే వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించేది ఈ కమిటీనే. అలాంటి కమిటీకి అధినేతగా జై షా ఎన్నిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆయన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ) కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఐసీసీలో ఈ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ పాత్ర అత్యంత కీలకం. సభ్యదేశాల మధ్య ఆదాయ భాగస్వామ్యాన్ని నిర్దేశించే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఏడాది పొడవునా ఐసీసీ కుదుర్చుకునే ఒప్పందాలు, వివిధ సిరీస్‌లు, టోర్నమెంట్స్‌కు సంబంధించిన ప్రధాన స్పాన్సర్‌షిప్ కాంట్రాక్ట్‌లను పర్యవేక్షిస్తుంది.