జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) (National Cricket Academy) డైరెక్టర్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆగస్టు 15ను (రాత్రి 11.59 గంటల వరకు) చివరి తేదీగా ప్రకటించింది. ప్రస్తుతం ఆ పదవిలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కొనసాగుతున్నాడు.
ద్రవిడ్.. రెండేళ్ల కాలానికిగానూ 2019 జులైలో ఎన్సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో పాటు భారత అండర్-19, భారత-ఏ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో చాలామంది యువ క్రికెటర్లు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా రిజర్వ్ బెంచ్‌ను బలంగా తయారుచేయడంలో ద్రవిడ్ సఫలమయ్యాడు. దీంతో ఈ పదవికి ద్రవిడ్ (Rahul Dravid) తిరిగి దరఖాస్తు చేసే అవకాశముంది.
"ద్రవిడ్ ఎన్సీఏ పదవికి మరోమారు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ద్రవిడ్.. భారత కోచ్‌గా నియామకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
"జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఎంపికైన వ్యక్తి యువ ఆటగాళ్లకు సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకోవాలి. ఆటగాళ్ల సన్నద్ధత, వారి ప్రదర్శన మెరుగుపర్చడానికి కృషి చేయాలి. భారత్-ఏ, అండర్-23, అండర్-19, అండర్-16 ఆటగాళ్లు, రాష్ట్రాల అసోసియేషన్ల ప్లేయర్లకు సంబంధించి బాధ్యత ఎన్సీఏ డైరెక్టర్‌దే" అని బీసీసీఐ స్పష్టం చేసింది.
ధావన్ నేతృత్వంలోని భారత జట్టు.. ఇటీవల పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించింది. ఈ టీమ్‌కు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2-1తో వన్డే సిరీస్‌ను గెలుపొందిన ఆ టీమ్, 2-1తో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. కొవిడ్ కారణంగా పలువురు ఆటగాళ్లు చివరి మ్యాచ్‌లకు దూరమయ్యారు. దీంతో టీమ్ఇండియా టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది.
రానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఒకవేళ అత్యుత్తమ ప్రదర్శన చేయకపోతే రవిశాస్త్రి భారత కోచ్ పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కోచ్ పదవీకి 60 ఏళ్ల గరిష్ఠ వయసును నిర్దేశించింది బీసీసీఐ. రవిశాస్త్రికి ప్రస్తుతం 59 ఏళ్లు. కోహ్లీ- శాస్త్రి ద్వయం ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ఈవెంట్ టైటిల్‌ను కూడా గెలువలేకపోయింది. దీంతో రానున్న టీ20 ప్రపంచకప్ గెలవడం తప్పనిసరి కానుంది. లేకపోతే కోచ్‌గా కొత్త వ్యక్తిని చూసే అవకాశముంది.
ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు అంతా సిద్ధం!