జూన్ నెలలో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్స్‌కు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. తాజా ఐపీఎల్లో దుమ్ములేపుతున్న అజింక్య రహానే వైపు సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపింది. మిస్టర్ 360గా పేరున్న సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటికే ఫైనల్ చేరిన భారత్ ఆస్ట్రేలియాతో పోటీపడనుంది. ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు మ్యాచ్ జరగనుంది.
శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేని కారణంగా రహానేకు పిలుపు అందింది. ప్రస్తుతం అయ్యర్ యూకేలో చికిత్స పొందుతున్నాడు. రహానే టీమ్ఇండియాలో 15 నెలల తర్వాత పునరాగమనం చేస్తున్నాడు. ఫైనల్లో అయ్యర్ స్థానంలో రహానే ఆడనున్నాడు.
రంజీ ట్రోఫీలో ముంబయి జట్టుకు సారథ్యం వహించిన 34 ఏళ్ల రహానే 700 పరుగులు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్లో చెన్నై తరఫున ఆడుతున్న అతడు ఏకంగా 200 స్ట్రయిక్ రేట్‌తో విజృంభిస్తున్నాడు. సేనా ( సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ఆడిన అనుభవం, టెస్ట్ మ్యాచ్‌ల్లో నిలకడగా రాణించడం.. ఇవన్నీ రహానెను మళ్లీ జట్టులోకి తీసుకొచ్చాయనే చెప్పవచ్చు. టెస్ట్‌ల్లో రహానె 140 ఇన్నింగ్స్‌ల్లో 38.52 సగటుతో 4931 పరుగులు చేశాడు. అందులో 12 శతకాలు, 25 అర్ధ శతకాలు ఉన్నాయి. టీమ్ మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌గా మాత్రమే కాకుండా కీపర్‌గా వినియోగించుకుని.. రహానెను అదనపు బ్యాటర్‌గా మిడిలార్డర్లో ఆడించడానికి అవకాశం ఉంది. కాగా భారత్ తరఫున రహానె 2022 జనవరిలో కేప్‌టౌన్‌లో సౌత్ఆఫ్రికాతో జరిగిన సిరీస్‌లో చివరిసారిగా ఆడాడు.
ఫైనల్లో తెలుగు తేజం భరత్...
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో భాగంగా జట్టులో ఉన్న కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు ఉద్వాసన పలికిన సెలక్టర్లు... తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు వికెట్ కీపర్‌గా అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్‌కు 12వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు. ఒకవేళ మ్యాచ్ జరిగే రోజుల్లో ఒక పూర్తి డే మొత్తం అంతరాయం ఏర్పడితే అదనంగా రిజర్వడే రోజు ఆడతారు.
రోహిత్ సారథ్యంలోని టీమ్ఇండియా జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, షమి, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
ఆస్ట్రేలియా జట్టు:
ప్యాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హరీస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, నేథన్ లియాన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మ్యాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.