Mahmudullah Test Retirement: బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ మహ్మదుల్లా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది ప్రారంభంలో జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌తో తిరిగి సుదీర్ఘ ఫార్మాట్ జట్టులోకి వచ్చిన ఇతడు.. ఎక్కువకాలం టెస్టుల్లో కొనసాగేందుకు సిద్ధంగా లేనని ఆ సమయంలోనే బోర్డుకు సూచించాడు. దీంతో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు ముందు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం నుంచి బంగ్లా-పాక్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
"టెస్టు కెరీర్‌ను ముగించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. టెస్టు జట్టులోకి తిరిగి వచ్చే సమయంలో నాకు మద్దతుగా నిలిచిన బంగ్లా క్రికెట్ బోర్డుకు కృతజ్ఞతలు. నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచిన సహఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలు. బంగ్లాదేశ్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. నేను టెస్టుల నుంచి రిటైరైనా.. వన్డే, టీ20లు మాత్రం ఆడతా."
-మహ్మదుల్లా, బంగ్లా క్రికెటర్
Mahmudullah Test Career: బంగ్లా తరఫున 50 టెస్టులాడిన మహ్మదుల్లా 33.11 సగటుతో 2914 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 16 అర్ధసెంచరీలు ఉన్నాయి. జింబాబ్వేతో జరిగిన టెస్టులో 150 పరుగులు చేసి.. కెరీర్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల్ని నమోదు చేశాడు.