బాల్ టాంపరింగ్ వివాదాన్ని తెరపైకి తెచ్చిన ఆసీస్ ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్.. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ వివాదం గురించి చెప్పడానికి కొత్త సమాచారమేమీ లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ విభాగంతో పేర్కొన్నట్లు సమాచారం.
ప్రస్తుతం యూకేలోని కౌంటీల్లో దుర్హామ్ తరఫున ఆడుతున్న బాన్‌క్రాఫ్ట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ విభాగం ప్రతినిధుల బృందం కలిసింది. సాండ్ పేపర్ వివాదంపై ఏదైనా అదనపు సమాచారం ఉంటే తెలియజేయాలని కోరింది. అందుకు రాజీ పద్ధతిలో స్పందించాడు బాన్‌క్రాఫ్ట్. ఆ వివాదానికి సంబంధించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియా క్రికెట్లో బాన్‌క్రాఫ్ట్ కలకలం
గతంలో క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన దర్యాప్తునకు మద్దతు తెలిపానని.. వారిచ్చిన ఫలితంతో సంతృప్తిగా ఉన్నట్లు బాన్‌క్రాఫ్ట్ స్పష్టం చేశాడు.
2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సందర్భంగా బంతికి ఉప్పు కాగితం రుద్ది అడ్డంగా దొరికిపోయాడు బాన్‌క్రాఫ్ట్. ఇందులో కెప్టెన్ స్మిత్‌తో పాటు వైస్ కెప్టెన్ వార్నర్‌ను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆ వివాదం గురించి ఆనాటి జట్టులోని బౌలర్లకు కూడా తెలుసని బాన్‌క్రాఫ్ట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దీనిపై మరోసారి దర్యాప్తు చేయడానికి కూడా సిద్ధమని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'బాల్ టాంపరింగ్ వివాదంపై వార్నర్ బుక్ రాయాలి'