Asia Cup 2022: ఆసియా కప్ 15వ సీజన్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 మధ్య శ్రీలంకలో జరగనుంది. శనివారం సభ్యదేశాల మధ్య సమావేశం అనంతరం తేదీలను ఆసియా కప్ నిర్వాహకులు ప్రకటించారు. ఐదు టెస్టు జట్లు(ఇండియా, బంగ్లా, పాక్, శ్రీలంక, అఫ్గాన్) నేరుగా పోటీ పడనున్నాయి.
Asia Cup 2022 schedule
ఆగస్టు 20 నుంచి జరగనున్న క్వాలిఫయర్ టోర్నీలో యూఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ దేశాలు పాల్గొననున్నాయి. ఇందులో తొలిస్థానంలో నిలిచిన జట్టు.. ఆసియా కప్ ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధిస్తుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఆసియా కప్‌ను నిర్వహించనున్నారు.
రెండేళ్లకోసారి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. 2018లో జరిగిన టోర్నీలో భారత్ గెలిచింది. కరోనా మహమ్మారి వల్ల 2020లో జరిగాల్సిన టోర్నమెంట్ 2021కు వాయిదా పడింది. గతేడాది కూడా పరిస్థితులు నియంత్రణలోకి రాలేదు. దీంతో టోర్నీని ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. 2022 ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సిన పాకిస్థాన్.. ఆ టోర్నీని 2023లో నిర్వహించనుంది.
1984 నుంచి జరుగుతున్న ఈ టోర్నీలో ఆసియా దేశాలు పాల్గొంటాయి. చివరగా జరిగిన 2018తో కలిపి మొత్తంగా 7 సార్లు విజేతగా నిలిచిన టీమ్ఇండియా.. టాప్‌లో కొనసాగుతోంది.
జై షా పదవీకాలం పొడగింపు..
మరోవైపు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శిగా బీసీసీఐ సెక్రెటరీ జై షా పదవీకాలం మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. 2024 వరకు ఆయన పదవీకాలాన్ని పొడగిస్తూ కొలొంబోలో జరిగిన ఏసీసీ సమావేశంలో సభ్య దేశాలు నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. పంకజ్ ఖిమ్జీ ఏసీసీ ఉపాధ్యక్షుడిగా, అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా వల్లిపురం మహీంద ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి: 'కోహ్లీ.. కచ్చితంగా వంద సెంచరీలు చేస్తాడు'