Ashes 2021 Joe Root: యాషెస్ సిరీస్ తొలి టెస్టు ఓటమితో ఒత్తిడిలో పడిపోయిన ఇంగ్లాండ్ ప్రస్తుతం రెండో టెస్టులో గెలుపు కోసం పోరాడుతోంది. ఇలాంటి స్థితిలో జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జో రూట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడటం వల్ల రెండో టెస్టు నాలుగో రోజు ఫీల్డింగ్ కోసం మైదానంలో అడుగుపెట్టలేదు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇతడు బ్యాటింగ్‌కు దిగేది అనుమానంగా మారింది.
"అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ప్రాక్టీస్ సెషన్ సమయంలో రూట్ గాయపడ్డాడు. బంతి కడుపులో తాకడం వల్ల ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం అతడు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాడు. అందుకే నాలుగో రోజు ఫీల్డింగ్‌కు రాలేదు" అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.
పటిష్ట స్థితిలో ఆసీస్
ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులో ఉంది ఇంగ్లాండ్. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 473 పరుగులకు డిక్లేర్డ్ ఇవ్వగా.. ఇంగ్లీష్ జట్టు కేవలం 236 పరుగులకే ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు డిన్నర్ బ్రేక్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది ఆసీస్. హెడ్ (45*), లబుషేన్ (31*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 371 పరుగుల ఆధిక్యంలో ఉంది కంగారూ జట్టు.