Ashes 2021: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో యాషెస్ టెస్టు ఉత్కంఠభరితంగా సాగి చివరికి డ్రాగా ముగిసింది. చివరిరోజు ఆసీస్ బౌలర్లు విజృంభించినా.. పోరాట పటిమ కనబర్చిన ఇంగ్లాండ్ చివరి వికెట్ వరకు పోరాడింది. దీంతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
ఆఖరి రోజు విజయానికి ఇంగ్లాండ్‌కు 258 పరుగులు అవసరం అవగా.. ఆస్ట్రేలియాకు 10 వికెట్లు దక్కాల్సి ఉంది. దీంతో రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. క్రాలే (77), స్టోక్స్ (60) అర్ధసెంచరీలతో రాణించారు. బెయిర్ స్టో (41) ఆకట్టుకున్నాడు. వీరితో పాటు చివర్లో జాక్ లీచ్ (26) పోరాడాడు. ఓ వైపు వరుస వికెట్లు పడుతున్నా ఇంగ్లాండ్ బ్యాటర్లు మాత్రం ఆందోళనకు లోనవ్వలేదు. కమిన్స్ ఒకే ఓవర్లో బట్లర్ (11), వుడ్ (0)లను ఔట్ చేసి ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెంచాడు. కానీ స్టువర్ట్ బ్రాడ్ (8*), అండర్సన్ (0*) చివరి వికెట్‌ను పడకుండా అడ్డుకున్నారు. దీంతో చివరి రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేయగలిగింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 416 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న ఖవాజా (137) అద్భుత సెంచరీతో కదం తొక్కగా.. స్మిత్ (67) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఇంగ్లాండ్‌ను 294 పరుగులకే ఆలౌట్ చేసింది కంగారూ జట్టు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెయిర్‌స్టో (113) సెంచరీతో మెరవగా.. స్కోక్స్ (66) హాఫ్ సెంచరీ చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ఖవాజా సెంచరీతో సత్తాచాటడం వల్ల 68.5 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసి డిక్లేర్ చేసింది ఆసీస్.