మరి మూడు రోజుల్లో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభంకానుంది. నాగ్‌పుర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమ్ఇండియా తలపడనుంది. అయితే తొలి టెస్టుకు ముందు జట్టు కూర్పు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు పెద్ద తలనొప్పిగా మారినట్లు అర్థమవుతోంది. వికెట్ కీపర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై టీమ్ మేనేజెమెంట్ తెగ ఆలోచిస్తుందట. ఈ క్రమంలోనే ఆంధ్ర క్రికెటర్ శ్రీకర్ భరత్ పేరు తెరపైకి వచ్చింది. అతడికి అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారట. ఒకవేళ ఇది జరిగితే అతడు టెస్టుల్లోకి అరంగేట్రం చేసినట్టవుతుంది. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
"గత రెండేళ్లుగా రాహుల్ చాలా సార్లు గాయపడ్డాడు. టెస్టుల్లో అతడికి వికెట్ కీపింగ్ సరికాదు. ఈ ఫార్మాట్లో స్పెషలిస్టు వికెట్ కీపర్స్ అవసరం. ప్రస్తుతం జట్టులో భరత్, ఇషాన్ కిషన్ స్పెషలిస్ట్ వికెట్ కీపర్లగా ఉన్నారు. అయితే వీరిద్దరిలో భరత్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది" అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు.
కాగా, ఇటీవలే కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను తొలిసారి టెస్టులకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా దాదాపు రెండేళ్ల నుంచి టెస్టు అరేంగట్రం కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్‌కు కూడా జట్టులో చోటు కల్పించారు. అయితే భరత్ గత కొంత కాలంగా జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ తుది జట్టులో మాత్రం అవకాశం అందుకోలేకపోతున్నాడు. ఇక స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్ జట్టులో మరో వికెట్ కీపర్‌గా అందుబాటులో ఉన్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం అతడికి వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇచ్చే సూచనలు కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఇషాన్ కిషన్ లేదా భరత్.. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఎవరిని ఎంచుకోవాలనే విషయమై చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు వికెట్ కీపర్‌గా కిషన్ కన్నా భరత్‌వైపే జట్టు మెనేజెమెంట్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అందింది. ఆ విషయాన్నే ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. దీంతో అతడు టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయమనిపిస్తోంది.
ఇదీ చూడండి: T20 worldcup: జూనియర్లు గెలిచారు.. ఇక సీనియర్లు ఏం చేస్తారో?