Afg Vs Ban ODI World Cup 2023 : 2023 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న బంగ్లా.. ప్రత్యర్థిని 156 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్యాన్ని 34.4 ఓవర్లలోనే ఛేదించింది. మెహిదీ హసన్ మిరాజ్ బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన అతడు.. బ్యాటింగ్‌లో అర్థశతకంతో రాణించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్.. ఆరంభంలో నిలకడగా ఆడింది. ఓపెనర్లు గుర్బాజ్ ఖాన్, ఇబ్రహీం జద్రాన్‌లు తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఇరువురు సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. రెహ్మత్ షా(18), కెప్టెన్ షాహిదీ(18)లు భారీ ఇన్నింగ్స్ నిర్మించడంలో విఫలమయ్యారు. 15.1 ఓవర్ల సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 83 పరుగులు సాధించిన అఫ్గాన్.. తర్వాత పూర్తిగా చతికిలపడిపోయింది. క్రమంగా వికెట్లు కోల్పోయింది. అజ్మతుల్లా(22) రాణించాడు. మిగిలిన ప్లేయర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకిబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. షొరీఫుల్ ఇస్లాం రెండు, తస్కిన్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.
World Cup 2023 Youngest Player : నూర్ అహ్మద్ టు విక్రమ్‌జీత్.. మెగాటోర్నీలో యంగ్ ప్లేయర్స్ వీరే
ఆరంభంలో తడబడి..
అటు ఛేజింగ్‌లో బంగ్లాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. బంగ్లా ఓపెనర్ తంజిద్ హసన్ 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ లిట్టన్ దాస్ 13 రన్స్‌కు పెవీలియన్ చేరాడు. దీంతో 27 పరుగులకే బంగ్లా రెండు వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత వ్చచిన మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హొస్సైన్ శాంటోలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. అప్పుడప్పుడు బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును నడిపించారు. మెహిదీ 57 పరుగులు చేసి నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయి వెనుదిరగ్గా.. సారథి షకిబ్ 14 పరుగులకే అజ్మతుల్లా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. చివరి వరకు క్రీజులో నిలబడిన నజ్ముల్ 59 పరుగులు చేసి బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా తలో వికెట్ తీశారు. స్టార్ బౌలర్ రషీద్ ఖాన్.. 9 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 48 పరుగులు ఇచ్చుకున్నాడు.
అఫ్గాన్ చెత్త రికార్డు
తాజా మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ వరుసగా 13 మ్యాచ్‌లలో ఓడినట్లైంది. 2015 నుంచి 2023 మధ్య ఆడిన 13 మ్యాచ్‌లలో అఫ్గాన్ ఓటమి చవి చూసింది. జింబాబ్వే (1983 నుంచి 1992 మధ్య) 18 మ్యాచ్‌లలో ఓడిపోయి.. అత్యధిక ఓటముల జాబితాలో తొలి స్థానంలో ఉంది. స్కాట్లాండ్ (1999 నుంచి 2015 మధ్య) 14 వరుస మ్యాచులలో ఓడింది.