2022 International Sports Calendar: కొత్త ఏడాదిలోకి వచ్చేశాం. క్యాలెండర్ మారగానే క్రీడాప్రేమికుల చూపంతా ఈ ఏడాదిలో జరగబోయే ఆటలపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో 2022లో జరగబోయే మెగాటోర్నీలు ఏంటో చూసేద్దాం..
ఏ కప్పు ఎవరిదో?
2022 World Cup Tournament: 2022ను ప్రపంచకప్ నామ సంవత్సరంగా చెప్పొచ్చు. రెండు ఆటల్లో మూడు ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లు చూడబోతున్నామీ ఏడాది. అందులో ఎంతో ప్రత్యేకమైన ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ మెగా టోర్నీ అంటే ప్రపంచవ్యాప్తంగా సాకర్ ప్రియులు ఎలా పడిచస్తారో తెలిసిందే. ఇందులో పోటీ తత్వం, ఉత్కంఠ గురించి ఎంత చెప్పినా తక్కువే. అత్యుత్తమ జట్లు, మేటి ఫుట్‌బాలర్లు తలపడే టోర్నీలో కప్పు ఎవరిని వరిస్తుందో అంచనా వేయడం కష్టమే. మరి ఈసారి ఈ మెగా టైటిల్ గెలిచే జట్టేదో చూడాలి. ఇక క్రికెట్ ప్రేమికుల కోసం ఒకటికి రెండు ప్రపంచకప్‌లు సిద్ధమయ్యాయి. మార్చి-ఏప్రిల్ నెలల్లో మహిళల ప్రపంచకప్ సిద్ధమవుతోంది. అందులో మన మిథాలీ నేతృత్వంలో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక ఏడాది చివర్లో పురుషుల టీ20 ప్రపంచకప్ చూడబోతున్నాం. 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టోర్నీ వాయిదా పడటం వల్ల పది నెలల వ్యవధిలో రెండో పొట్టి కప్పు అభిమానుల ముందుకొస్తోంది. మరి ఈసారైనా టీమ్‌ఇండియా కప్పు సాధిస్తుందేమో చూడాలి.
ఈసారి ఏ పతకం?
2022 BWF tour: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తూ ప్రతిసారీ పతకాలు పట్టుకొస్తున్నారు భారత క్రీడాకారులు. 2019లో సింధు స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టిస్తే.. గత ఏడాది కిదాంబి శ్రీకాంత్ రజతం నెగ్గి రికార్డులకెక్కాడు. ఈ ఏడాది వీళ్లిద్దరూ భారీ అంచనాలతో ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. సాయిప్రణీత్ మీదా మంచి అంచనాలున్నాయి. గాయం కారణంగా కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న సైనా కూడా ఆడుతుందేమో చూడాలి. మరి ఈసారి ఈ మెగా ఈవెంట్లో మనవాళ్లు ఏ పతకాలు, ఎన్ని పట్టుకొస్తారో చూడాలి.
సంబరాలు ముగిశాయ్.. ఇక మళ్లీ!
టోక్యోలో ఎవ్వరూ ఊహించని అద్భుతాన్ని ఆవిష్కరించాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో ఏదో ఒక పతకం సాధిస్తేనే అద్భుతం అనుకుంటే.. ఏకంగా స్వర్ణం సాధించి ఔరా అనిపించాడు. ఆ పతకం దేశాన్ని ఎంత ఆనందంలో ముంచెత్తిందో కొత్తగా చెప్పేదేముంది? ఆ విజయాన్ని నీరజ్ సహా అందరూ ఆస్వాదించారు. కొన్ని నెలల పాటు సంబరాలు, సన్మానాల్లో మునిగి తేలాడు నీరజ్. ఇప్పుడిక మళ్లీ ఆటపై దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే అతను మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడీ హరియాణా కుర్రాడు. మరి నీరజ్ అంచనాలను అందుకుంటాడా, టోక్యోలో అతడి ప్రదర్శన ఇచ్చిన స్ఫూర్తితో ఈ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడబోతున్న మిగతా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు సత్తా చాటుతారా.. చూద్దాం!
అతను కొడతాడా.. ఇతను ముగిస్తాడా?
2022 Tennis Calendar: 2017లో రోజర్ ఫెదరర్ 20 నెగ్గేటప్పటికి జకోవిచ్ టైటిళ్ల సంఖ్య 12. అప్పటికి నాదల్ 15 గ్రాండ్‌స్లామ్‌లతో ఉన్నాడు. వాళ్లిద్దరూ రోజర్‌ను అందుకోవడం కష్టమని, పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా ఫెదరర్ చరిత్రలో నిలిచిపోతాడని చాలామంది భావించారు. కానీ 2021 సీజన్ ముగిసేసరికి ఈ ముగ్గురూ 20 టైటిళ్లతో సమానంగా ఉన్నారు. ఇప్పుడీ ముగ్గురిలో మంచి ఊపుమీదున్నది జకోవిచే. గత ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌లు ఖాతాలో వేసుకున్నాడతను. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల వీరుడిగా నిలవకుండా అతణ్ని ఆపేవాళ్లెవ్వరూ కనిపించడం లేదు. ఫెదరర్ ఇంకో టైటిల్ గెలుస్తాడన్న సంకేతాలు ఏమాత్రం లేవు. నాదల్ జోరూ తగ్గిపోయింది. కాబట్టి నొవాక్ 2022లో ఈ అద్భుత రికార్డును సొంతం చేసుకుంటాడేమో చూడాలి. 40 ఏళ్ల రోజర్ ఈ ఏడాది టైటిల్ గెలిచినా, గెలవకున్నా ఆట నుంచి నిష్క్రమించడం ఖాయం కావచ్చు.
మిథాలీ సాధిస్తుందా?
2022 Women's ODI World Cup: హైదరాబాదీ దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ సాధించిన ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. మహిళల క్రికెట్‌కు అసలేమాత్రం గుర్తింపు లేని రోజుల్లో ఆటలో అడుగు పెట్టి దేశంలో ఆ ఆటకే ఆదరణ తెచ్చి, ఎంతోమంది అమ్మాయిలు ఇటువైపు అడుగు పెట్టేలా స్ఫూర్తినిచ్చిన దిగ్గజం ఆమె. 20 ఏళ్లకు పైగా సాగుతున్న సుదీర్ఘ కెరీర్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకుంది మిథాలీ. అయితే ప్రపంచకప్ సాధించాలన్న ఆమె కల మాత్రం నెరవేరలేదు. 2017లో కప్పు అందినట్లే అంది చేజారింది. ఇప్పుడు 40వ పడిలో ఆమె చివరగా ఓ ప్రయత్నం చేయబోతోంది. మార్చిలో మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా జట్టును నడిపించబోతోంది. ఈ టోర్నీలో జట్టును విజేతగా నిలిపి ఆట నుంచి నిష్క్రమిస్తే తన ఉజ్వల కెరీర్‌కు అంత కంటే గొప్ప ముగింపేముంటుంది?
- మహిళల వన్డే ప్రపంచకప్ (మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు, న్యూజిలాండ్‌లో)
వింటర్ ఒలింపిక్స్ (ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు, చైనాలో)
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (జులై 15 నుంచి 24 వరకు, అమెరికాలో)
పురుషుల టీ20 ప్రపంచకప్ (అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు, ఆస్ట్రేలియాలో)
ఫుట్‌బాల్ ప్రపంచకప్ (నవంబరు 21 నుంచి డిసెంబరు 18 వరకు, ఖతార్‌లో)
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ (ఆగస్టు 21 నుంచి 28 వరకు, జపాన్‌లో)
ఇదీ చూడండి: కాస్త దూరంలో మూడు దశాబ్దాల కల.. చెమటోడ్చితేనే సాకారం!