భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు మరో అద్భుత విజయం సొంతం చేసుకొనేందుకు ఓ మెట్టు దూరంలో ఉంది. ఇండోనేషియా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్-1000 టోర్నీలో ఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో మూడో సీడ్ చైనా క్రీడాకారిణి చెన్ యూఫీపై 21-19, 21-10 తేడాతో గెలిచింది ఐదో సీడ్ సింధు.
తిరుగులేని స్మాష్‌లు..
మొదటి రౌండ్లో 4-7 తేడాతో వెనుకబడిన సింధు... వరుసగా ఐదు పాయింట్లు గెలుచుకొని ముందంజలో నిలిచింది. చైనా క్రీడాకారిణి అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఎత్తును ప్రధానంగా ఉపయోగించుకున్న సింధు ప్రత్యర్థికి అవకాశం లేని షాట్లతో చెలరేగింది. హోరాహోరీగా సాగిన పోరులో 21-19 తేడాతో తొలి సెట్ గెలుచుకొంది.
రెండో సెట్లో పూర్తిగా చేతులెత్తేసింది చైనీస్ ప్లేయర్. తొలి నుంచే ఆధిక్యంలో నిలిచిన సింధు 16-8తో నిలిచి.. చివరికి 21-10 తేడాతో విజయం సాధించి రెండో సెట్‌ను ముగించింది.
ఫైనల్లో యమగూచితో..
ఈ ఏడాది సింగపూర్ ఓపెన్, ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్ చేరినా ఒక్క టైటిల్ గెలవలేకపోయిన సింధు... ఇండోనేసియా ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టింది. టోర్నీ ఆద్యంతం తనకన్నా బలమైన ప్రత్యర్థులపై వరుసగా విజయాలు సాధించింది.
జపాన్ క్రీడాకారిణీ యమగూచి.. శనివారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ వన్ తైజు యింగ్‌ను 21-9, 21-15 తేడాతో ఓడించింది. సింధుతో టైటిల్ పోరుకు సిద్ధమవుతోంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.