ఇండోనేసియా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సత్తా చాటింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో నయోమి ఒకుహర(జపాన్)పై విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు 21-14, 21-7 తేడాతో మూడో సీడ్‌ను వరుస సెట్లలో ఓడించింది. 44 నిమిషాల పాటు ఈ పోరు హోరాహోరీగా సాగింది.
ఆరంభం నుంచే జపాన్ క్రీడాకారిణిపై ఆధిపత్యం ప్రదర్శించిన భారత ఒలింపిక్ పతక విజేత... తొలి సెట్‌లో 6-6 తేడాతో కొంత పోటీ ఎదుర్కొంది. అనంతరం వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 10-6తో దూసుకెళ్లింది. చివరికి 21-14 తేడాతో తొలి సెట్ కైవసం చేసుకుంది తెలుగు ప్లేయర్.
రెండో రౌండ్లో సింధు జోరుకు ప్రత్యర్థి నుంచి సమాధానం కరవైంది. తనకన్నా మెరుగైన ర్యాంకులో ఉన్న ఒకుహరపై తనదైన స్మాష్‌లతో విరుచుకుపడింది. చివరికి 21-7తో సెట్ గెలుచుకొని సెమీఫైనల్లో అడుగుపెట్టిందీ భారత షట్లర్.
రెండో సీడ్ చెన్ యు ఫీ(చైనా)తో తర్వాతి మ్యాచ్‌లో తలపడనుంది సింధు. వీరిద్దరూ బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ సూపర్-1000 టోర్నీలో నాలుగోసారి అమీతుమీ తేల్చుకోనున్నారు.
ఇవీ చూడండి...ఇంగ్లాండ్ కౌంటీల్లో దుమ్మురేపిన డివిలియర్స్