టోక్యో ఒలింపిక్స్ 2020లో స్థానం సంపాదించడం తదుపరి లక్ష్యమని భారత స్టార్ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ చెప్పాడు. ప్రస్తుత ర్యాంకును కాపాడుకుంటే విశ్వటోర్నీకి కచ్చితంగా అర్హత సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు.
స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా ఇటీవల ముగిసిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచాడీ ఆటగాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్‌లో 4 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ ర్యాంకు సాధించాడు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 30 నాటికి టాప్-16 ర్యాంకింగ్స్‌లో ఉండే క్రీడాకారులకు ఒలింపిక్స్ బెర్తు దక్కుతుంది. ఒక దేశం నుంచి గరిష్ఠంగా ఇద్దరికి మాత్రమే అవకాశం లభిస్తుంది. ఆ ఇద్దరిలో తాను ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రణీత్ చెప్పాడు.
"వచ్చే ఏడాది స్విస్ ఓపెన్ వరకు జరిగే టోర్నీల్లో మెరుగ్గా ఆడితే ర్యాంకు కాపాడుకోవచ్చు. స్విస్ ఓపెన్‌లో మాత్రమే ఎక్కువ పాయింట్లు నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. గతేడాది చైనా, కొరియా ఓపెన్ ఆడలేదు. డెన్మార్క్, ఫ్రెంచ్, హాంకాంగ్ ఓపెన్‌లలో ఆరంభంలోనే వెనుదిరిగా. ఈసారి ఈ టోర్నీల్లో క్వార్టర్స్, సెమీస్ చేరుకున్నా. టైటిల్ గెలిస్తే ర్యాంకింగ్ మరింత మెరుగవుతుంది. ఫిట్‌గా ఉంటే బాగా ఆడగలనని నాకు తెలుసు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ క్వార్టర్స్‌లో జొనాథన్ క్రిస్టీపై చివరి పాయింట్ నెగ్గడం నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి".
- సాయిప్రణీత్, భారత స్టార్ షట్లర్
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో 36 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రణీత్ భారత్‌కు పతకం అందించాడు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకోనున్నాడు.
ఇదీ చదవండి...హాకీ కర్ర పట్టుకున్న మాంత్రికుడు.. ఈ చంద్రుడు