జపాన్ ఓపెన్‌లో బుధవారం భారత్ మిశ్రమ ఫలితాలు అందుకుంది. పీవీ సింధు, ప్రణయ్ రెండో రౌండ్‌కు చేరుకోగా.. కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ తొలిరౌండ్లోనే ఓడి ఇంటిముఖం పట్టారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ - రాంకీ రెడ్డి జోడీ విజయాన్ని అందుకుంది.
ఐదో సీడ్ పీవీ సింధు.. ఇండోనేసియా ఓపెన్‌లోని ఫామ్‌ను ఇక్కడా కొనసాగించింది. చైనా క్రీడాకారిణి హన్యూను 21-9, 21-17 తేడాతో వరుస సెట్లలో ఓడించి విజయాన్ని అందుకుంది. రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన ఒహోరితో తలపడనుంది.
పురుషుల సింగిల్స్ విభాగంలో మన క్రీడాకారులు ప్రణయ్ - శ్రీకాంత్ తలపడ్డారు. 59 నిమిషాలు సాగిన ఈ పోటీలో ప్రణయ్ పైచేయి సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 13-21, 21-11, 22-20 పాయింట్ల తేడాతో శ్రీకాంత్ పరాజయం చెందాడు.
డెన్మార్క్‌కు చెందిన ఆండెర్స్ చేతిలో ఓడాడు సమీర్ వర్మ. 46 నిమిషాల పాటు సాగిన ఈ పోటీలో 17-21, 12-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం చెందాడు.
పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ - రాంకీ రెడ్డి జోడి ఇంగ్లాండ్ ద్వయం మార్కస్ - క్రిస్ లాంగ్రిడ్జ్పై గెలిచింది. 21-16, 21-17 తేడాతో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది. తర్వాత మ్యాచ్ కొరియా - చైనా జోడి మ్యాచ్‌లో గెలిచిన వారితో ఆడనుంది.
మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప - సిక్కి రెడ్డి జోడి కొరియాకు చెందిన ఇయాంగ్ కిమ్ - హీ యాంగ్ కాంగ్ ద్వయం చేతిలో పరాజయం చెందింది. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ - సిక్కి రెడ్డి జోడి చైనా ద్వయంపై ఓడి ఇంటిముఖం పట్టింది.
ఇది చదవండి: 'టోక్యో' ఒలింపిక్స్ పతకాల ఆవిష్కరణ