పురుషుల డబుల్స్‌లో సంచలన ప్రదర్శన చేస్తున్న భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ... మరో ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అందించే 'మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' జాబితాలో వీరిద్దరికీ చోటు దక్కింది.
మేటి ప్రదర్శన...
ఈ ఏడాది సాత్విక్-చిరాగ్ జోడీ.. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ విజేతగా, ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ రన్నరప్‌గా నిలిచారు. వీరితో పాటు భారత పారా షట్లర్ ప్రమోద్ భగత్ బీడబ్ల్యూఎఫ్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ ఏడాది వివిధ టోర్నీల్లో అతడు 11 స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించాడు.
'పురుషుల ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' జాబితాలో జపాన్ షట్లర్ కెంటో, ఇండోనేషియా డబుల్స్ జోడీ మార్కస్, కెవిన్, చైనా మిక్స్‌డ్ డబుల్స్ ప్లేయర్ జింగ్, ఇండోనేషియా షట్లర్ మహ్మద్, హెండ్రా పోటీ పడుతున్నారు.
సింధుకు నిరాశ
మహిళల సింగిల్స్‌లో రాణిస్తున్న ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు ఈ అవకాశం దక్కలేదు. చైనీస్ తైపీ షట్లర్ తైజు ఇంగ్ నామినేట్ అయింది. 'మహిళా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు చైనా మిక్స్‌డ్ డబుల్ ప్లేయర్ హుయాంగ్, జపాన్ డబుల్స్ షట్లర్లు యుకీ, సాయక, చైనా డబుల్స్ జోడీ చెన్ కింగ్, జియాయి నామినేట్ అయ్యారు.