రిటైర్మెంట్ అంటూ అభిమానులకు ఇటీవలే 'మినీ హార్ట్ ఎటాక్' తెప్పించిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. పూర్తి ఫిట్‌గా ఉన్నానని చెప్పింది. అలానే కోర్టులో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దీనితోపాటే లాక్డౌన్, ఒలింపిక్స్ వాయిదా, ఆసియా కప్ కోసం శిక్షణ, కోచ్ గోపీచంద్‌తో ఉన్న బంధం గురించి మాట్లాడింది.
- దినచర్యను ఒక్కసారిగా ఆపేయమంటే ఎవరికైనా కష్టమే. కానీ కరోనా వల్ల వచ్చిన లాక్డౌన్, ఇదే విషయాన్ని ఎంత ముఖ్యమో చెప్పింది. మనల్ని మనం కాపాడుకోవాలని గుర్తు చేసింది. మార్చి నుంచి ఇంట్లోనే ఉన్న నేను వర్కౌట్లతో పాటు కుటుంబంతో సమయాన్ని గడిపాను. పెయింటింగ్స్ వేశాను.
- కొన్ని నెలల ముందు ప్రాక్టీసు తిరిగి మొదలుపెట్టినప్పుడు ఆడలేకపోయాను. కానీ ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాను. కోర్టులో ఆడేందుకు సిద్ధంగానూ ఉన్నాను.
- కరోనా ప్రభావం మొదలైనప్పుడే టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడుతుందని అనుకున్నాను. దానికి ముందుగానే సిద్ధమవడం వల్ల భయపడాల్సిన అవసరం రాలేదు. ఈ విరామం నా ఆటలో మార్పేం తీసుకురాదు. వచ్చే ఏడాది జరిగే ఈ పోటీల్లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలో దిగుతాను.
- ఆసియా కప్ టోర్నీకి చాలా ఎదురుచూస్తున్నా. చాలాకాలం తర్వాత కోర్టులో అడుగుపెట్టనున్నా. శిక్షణ బాగానే సాగుతోంది. లాక్డౌన్ విరామం వల్ల మానసికంగా మెరుగయ్యా.
- గోపీసార్తో(కోచ్ గోపీచంద్) నాకు ఎలాంటి గొడవలు లేవు. ఆయన నాకు ఆటలో చాలా సహాయం చేశారు. ఇంగ్లాండ్‌లో శిక్షణ తీసుకుంటాననే విషయాన్ని కూడా ఆయనకు ముందుగానే చెప్పా.
- నెగిటివిటీ, కొవిడ్ పరిస్థితుల నుంచి రిటైర్ కావాలనుకుంటున్నా. ఆరోజు పోస్ట్ చేశా. పూర్తిగా చదివితే మీకే అర్ధమవుతుంది. అందరూ ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచించాలనే ఇలా ట్వీట్ చేశా. ఈ లాక్డౌన్లో నెగిటివిటీ, భయం, అనిశ్చితి లాంటి విషయాలు నన్ను చాలా భయపెట్టాయి.
ఇవీ చదవండి: