జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ క్రీడాకారుల కోసం ఓ కొత్త పరికరాన్ని తీసుకొచ్చాడు. ధ్యానం తీవ్రత, ఏకాగ్రత, శ్వాస, విశ్రాంతిని కొలిచే పరికరాన్ని 'ధ్యాన' పేరుతో అందుబాటులోకి తెచ్చాడు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అతడు 'ధ్యాన' యాప్ ఆధారిత పరికరాన్ని ఆవిష్కరించాడు. సింధు, సైనా సహా ఎందరో క్రీడాకారులను తీర్చిదిద్దిన అనుభవంతో క్రీడాకారుల కోసం ఇందులో పది సెషన్‌లను స్వయంగా రూపకల్పన చేసినట్లు వివరించాడు. తన వాయిస్ ఓవర్‌తో ఈ సెషన్‌లు ఉంటాయన్నాడు.
"మానసిక దృఢత్వం సాధించడంలో కీలకమైంది ధ్యానం. అందరూ ధ్యానం చేస్తారు. కానీ ఎంత తీవ్రత, ఏకాగ్రతతో ధ్యానం చేశాం.. ఎంత ప్రయోజనం కలిగిందన్న విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఉంగరంలా చేతి వేలికి ధరించి.. సెల్‌ఫోన్‌కు అనుసంధానించే 'ధ్యాన'తో ఇవన్నీ సాధ్యం. మ్యాచ్‌లకు ముందు క్రీడాకారుల్లో మానసిక ప్రశాంతతను నింపేందుకు.. ఉత్సాహం పెంచేందుకు ఇది దోహదపడుతుంది" అని గోపీచంద్ వివరించాడు. ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఇదీ చూడండి : తెలంగాణలో పచ్చదనం బాగా పెరిగింది: గోపీచంద్