సింధు స్వర్ణం గెలుస్తుందన్న నమ్మకంతోనే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లినట్లు జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. సింధు సమర్థతపై తనకెప్పుడూ అనుమానం లేదని తెలిపాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సింధు ఫేవరెట్‌గా బరిలో దిగుతుందంటున్న గోపీచంద్‌తో ఈనాడు ముఖాముఖి.
సింధు ఘనతను మీరెలా విశ్లేషిస్తారు?
దేశం గర్వించదగ్గ ఘనత ఇది. సింధు గత రెండుసార్లు ఫైనల్లో ఓడింది. ఈసారి స్వర్ణం గెలుస్తుందని ముందే అనుకున్నా. కొన్ని నెలలుగా సింధు సాధన.. ఫిట్‌నెస్‌పై కనబరిచిన శ్రద్ధ ఆమెకు కలిసొచ్చాయి. ఐదేళ్లుగా పెద్ద టోర్నీల్లో సింధు గొప్పగా ఆడుతోంది. ఈసారి అంచనాల్ని అందుకుని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. సాయిప్రణీత్ కాంస్యం సాధించి 36 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించాడు. ఈ టోర్నీ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో చిరస్మరణీయం.
ఫైనల్‌కు సింధును ఎలా సన్నద్ధం చేశారు?
ఫైనల్‌కు ప్రత్యేక వ్యూహంతో వెళ్లాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా సింధు ప్రశాంతంగా ఉండేలా చూశాం. ఒకుహర ర్యాలీ క్రీడాకారిణి. ఆమె ఉచ్చులో చిక్కుకోకుండా ఆరంభం నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడాలని సింధుకు సూచించా. షటిల్‌ను టాస్ చేయకుండా.. ప్రత్యర్థి దేహం మీదకే ఆడాలని చెప్పా. ప్రతి షాట్‌ను సింధు అలాగే ఆడిడం వల్ల ఒకుహరకు ఏమీ అర్థం కాలేదు. చివరి పాయింటు వరకు సింధు తీవ్రత తగ్గించలేదు.
గత రెండు ఫైనల్స్‌కు.. ఈ పోరుకు తేడా?
గతంలో రెండుసార్లు సింధు సుధీర్ఘ మ్యాచ్‌లు ఆడి ఫైనల్‌కు వచ్చింది. సరైన విశ్రాంతి.. రికవరీ లేకుండానే ఫైనల్లో ఆడాల్సొచ్చింది. ఈసారి మాత్రం సింధుకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. సెమీస్ పోరు 40 నిమిషాల్లో పూర్తవడం వల్ల ఫైనల్‌కు సిద్ధమవడం సులువైంది. ఒకుహర, రచనోక్ సెమీస్ 80 నిమిషాలు సాగడం సింధుకు కలిసొచ్చింది.
సింధు సిల్వర్ స్టార్ అంటూ వచ్చిన విమర్శలకు సమాధానం లభించినట్లేనా?
సిల్వర్ స్టార్ అంటూ సింధు గురించి ఏవేవో మాట్లాడారు. మిగతా వారికి సందేహాలున్నాయేమో గానీ సింధు సమర్థతపై నాకెప్పుడూ అనుమానం లేదు. కావాల్సినంత శిక్షణ ఉంటే సింధుకు ఎదురుండదని తెలుసు. కచ్చితంగా ప్రపంచ ఛాంపియన్ అవుతుందన్న నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాం. సింధు అందరి నమ్మకాన్ని నిలబెట్టింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యాలు గెలిచారు.. రజతాలు సాధించారు.. మరి స్వర్ణం మాటేమిటి? అంటూ ప్రశ్నలు తలెత్తాయి. తాజా ప్రదర్శనతో సింధు విమర్శకులకు సమాధానం చెప్పింది.
భారత బ్యాడ్మింటన్‌లో సింధును అత్యుత్తమ క్రీడాకారిణిగా భావించవచ్చా?
ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్స్, ఆసియా క్రీడలు సహా ప్రతి పెద్ద టోర్నీలో సింధు పతకాలు సాధించింది. బ్యాడ్మింటన్‌లో ముమ్మాటికీ సింధు అత్యుత్తమ క్రీడాకారిణిల్లో ఒకరు. ఈ క్రీడలో సైనా నెహ్వాల్, సింధులది ప్రత్యేక స్థానం. భారత బ్యాడ్మింటన్ ఎదుగుదలకు సైనా గట్టి పునాది వేసింది. ఆ బాటపై నడిచిన సింధు అత్యున్నత శిఖరాల్ని అధిరోహించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణం సాధిస్తుందా?
రియో ఒలింపిక్స్‌కు అండర్‌డాగ్‌గా వెళ్లాం. మన క్రీడాకారుల గురించి ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల సన్నాహం సులువైంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సింధు రజతం గెలిచింది. ఇప్పుడు పూర్తిగా భిన్నం. టోక్యో ఒలింపిక్స్‌కు ఫేవరెట్‌గా వెళ్తున్నాం. సింధును ఓడించడానికి మిగతా క్రీడాకారిణులు ఈ ఏడాదంతా ప్రయత్నిస్తారు. ప్రణాళికలు రచిస్తారు. సింధు ఆటతీరును క్షుణ్ణంగా చదివేస్తారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తత.. ఏకాగ్రత అవసరం. రెట్టింపు కష్టంతో టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవ్వాలి. అప్పుడే బంగారు కల నిజమవుతుంది.
ఇవీ చూడండి.. ప్రధాని మోదీని కలిసిన పీవీ సింధు