టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నమెంట్ ముగిసింది. మహిళల సింగిల్స్ విజేతగా కరోలినా మారిన్ నిలిచింది. మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్‌లో యోనెక్స్ ఫైనల్ ప్రత్యర్థులే.. ఇక్కడా తలపడడం విశేషం.
వరుసగా రెండో టైటిల్..
కరోలినా మారిన్ ఫైనల్లో తైవాన్ ప్లేయర్, ప్రపంచ 1వ నంబర్ సీడ్.. టై తుయింగ్ను చిత్తు చేసింది. 21-19, 21-17 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. వారం వ్యవధిలో వరుసగా రెండో టోర్నీని కైవసం చేసుకుంది మారిన్. యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్‌ను ఇటీవల గెలుపొందిన స్పెయిన్ షట్లర్.. తాజాగా టొయోటా ఓపెన్‌నూ ఒడిసి పట్టింది.
ఇక పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇద్దరూ డెన్మార్క్ ఆటగాళ్లే తలపడ్డారు. హన్స్ క్రిస్టియన్‌పై 21-11, 21-7 తేడాతో విక్టర్ ఆక్సెల్సెన్ విజయం సాధించాడు.
మహిళల డబుల్స్ ఫైనల్ మొత్తం కొరియన్ ప్లేయర్ల మధ్య జరిగింది. విజేతలుగా కిమ్ సో యోంగ్, కాంగ్ హీ యోంగ్ ద్వయం గెలుపొందింది. లీ సో హీ, షిన్ సెంగ్ చన్ జంటపై 21-18, 21-19 తేడాతో విజయం సాధించింది.
పురుషుల డబుల్స్‌ను తైవాన్ ద్వయం లీ యాంగ్, వాంగ్ చి లిన్ గెలుచుకుంది. 36 నిమిషాల ఆటలో 21-13, 21-18 తేడాతో మలేషియా జంట ఆరోన్ చై, సో వుయ్ యిక్‌లపై విజయం సాధించారు.
మిక్స్డ్ డబుల్స్‌లో థాయ్‌లాండ్ ఆటగాళ్లపై కొరియన్ ద్వయం గెలుపొందింది. సియో సుంగ్, చే యుజుంగ్లు విజేతలుగా నిలిచారు.
ఇదీ చదవండి: 'ఓపికతో బౌలింగ్ చేస్తే వికెట్లు అవే వస్తాయి'