లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈ నెల రెండోవారం నుంచి దేశవ్యాప్తంగా వివిధ క్రీడల్లో మళ్లీ కార్యకలాపాలు మొదలయ్యాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారులు కూడా అక్కడక్కడా సాధన ఆరంభించారు. బెంగళూరులోని ప్రకాశ్ పదుకొణె అకాడమీలో కొందరు షట్లర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ దేశంలో అత్యధికంగా షట్లర్లుండే హైదరాబాద్‌లో మాత్రం సాధనకు అవకాశం లేదు. క్రీడా కార్యకలాపాలేవీ ఆరంభించడానికి ఇక్కడి ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నెలలో కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతుండటమే ఇందుకు కారణం.
అయితే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా శిబిరం ఆరంభించేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రణాళిక రూపొందించింది. పి.వి.సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ సహా అగ్రశ్రేణి షట్లర్లందరూ ఆ శిబిరంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ శిబిరానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో శుక్రవారం 985 కరోనా కేసులు బయటపడ్డాయి. అందులో మెజారిటీ కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. ఈ నేపథ్యంలో ఇక్కడ శిబిరం ఆరంభించడం సరైందేనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే సినిమా షూటింగ్‌లు సహా అన్ని కార్యకలాపాలూ నడుస్తున్నా క్రీడలకు మాత్రం షరతులు పెట్టడం ఏంటని షట్లర్లు ప్రశ్నిస్తున్నారు.
అందరి కంటే క్రీడాకారులకే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ ఉంటుందని.. అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ సాధన సాగిస్తామని వారంటున్నారు. జులై 1 నుంచి షట్లర్ల సాధన ఆరంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూనే.. ఇంకొన్ని రోజులు అనుమతులు లభించకపోయినా ఇబ్బంది లేదని అంటున్నాడు జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్. లాక్‌డౌన్ సమయంలో షట్లర్ల ఫిట్‌నెస్‌ను పర్యవేక్షిస్తూనే ఉన్నామని.. ఆరు వారాల పాటు సాధన చేస్తే వారు పూర్వ స్థితికి చేరుకోగలరని గోపీ చెప్పాడు.
"కరోనా వల్ల సాధనకు కొన్ని నెలల పాటు అడ్డుకట్ట పడింది. అయితే ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాక జులై 1 నుంచి హైదరాబాద్‌లో శిబిరాలు ఆరంభించాలని నిర్ణయించాం. కానీ ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది’"
- అజయ్ సింఘానియా, బాయ్ కార్యదర్శి
అప్పటిదాకా దేశవాళీ టోర్నీల్లేవ్
జులై 1 నుంచి షట్లర్ల సాధన ఆరంభమైనా.. ఇంకో రెండు నెలల పాటు దేశంలో బ్యాడ్మింటన్ టోర్నీలు ఏవీ జరగబోవు. ఈ మేరకు బాయ్ నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం మొదలైన కొత్తలో ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు లక్నోలో జరగాల్సిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను వాయిదా వేస్తున్నట్లు బాయ్ ప్రకటించింది. కొన్ని నెలల తర్వాత టోర్నీని నిర్వహించాలనుకుంది. కానీ అందుకు అవకాశం లేకపోయింది.
పరిస్థితులు మెరుగుపడితే సెప్టెంబరులో జాతీయ బ్యాడ్మింటన్‌తో పాటు మిగతా టోర్నీలను ఒక్కొక్కటిగా నిర్వహించాలనుకుంటోంది. ఈ ఏడాది దేశంలో జరగాల్సిన రెండు అంతర్జాతీయ టోర్నీలు (ఆగస్టు 4-9 మధ్య ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రి, ఆగస్టు 11-16 మధ్య హైదరాబాద్ ఓపెన్) రద్దయ్యాయి. మార్చిలో జరగాల్సిన ఇండియా ఓపెన్‌ను డిసెంబరు 8-13 తేదీలకు వాయిదా వేశారు.
ఇది చూడండి : ఐపీఎల్ ఓ పండుగలా ఉంటుంది: గుల్