టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)లో పతకం సాధించడమే తన లక్ష్యమని భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్(Sai Praneeth) అంటున్నాడు. విశ్వ క్రీడల్లో పాల్గొనడం కోసమే వెళ్లట్లేదని.. పతకం సాధించడానికే బరిలో దిగుతున్నానని చెప్పాడు. 2019 బాసెల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ (Basel World Championship-2019)లో కాంస్య పతకంతో మెరిసిన సాయిప్రణీత్ టోక్యో ఒలింపిక్స్‌లోనూ సత్తాచాటాలని భావిస్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున సాయిప్రణీత్ ఒక్కడే అర్హత సాధించాడు. ప్రకాశ్ పదుకొనె తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన సాయిప్రణీత్‌పై ఒలింపిక్స్‌లో భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే అంచనాల గురించి ఆలోచించకుండా పతకంపైనే దృష్టిసారిస్తానని అంటున్న సాయిప్రణీత్‌తో 'ఈనాడు' ముఖాముఖి వివరాలు అతని మాటల్లోనే..
దిగే దాకా తెలియదు..
ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా వ్యూహాలేమీ లేవు. ఇన్నేళ్ల నుంచి ఆడుతున్నాం కాబట్టి ఆట, నైపుణ్యంలో పెద్దగా తేడా ఉండదు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండటమే అత్యంత కీలకం. నాకెలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవు. లాక్‌డౌన్ సమయంలోనూ గోపీచంద్ అకాడమీలోనే ఉంటూ సాధన, ఫిట్‌నెస్ కసరత్తులు చేసుకున్నా. పురుషుల సింగిల్స్‌లో తీవ్రమైన పోటీ ఉంటుంది. మ్యాచ్ రోజు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆడిన వాళ్లదే విజయం. జపాన్‌లో కోర్టులు నెమ్మదిగా ఉంటాయి. ర్యాలీలు సుదీర్ఘంగా సాగుతాయి. అందుకు తగ్గట్లు సన్నద్ధమవుతున్నా. స్థానికంగా స్పేరింగ్ భాగస్వాములు ఉన్నారు. శ్రీకాంత్, ప్రణయ్ సహాయం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీకి తగ్గట్లుగా వాళ్లతో సాధన చేస్తున్నా. ఒలింపిక్స్‌కు ముందు అంతర్జాతీయ టోర్నీలు జరగలేదు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం లాభమా.. నష్టమా అన్నది ఇప్పుడే చెప్పలేం. అందరం ఒకేలాంటి పరిస్థితిలో ఉన్నాం. సాధారణ టోర్నీకి సిద్ధమైనట్లే ఒలింపిక్స్‌కు వెళ్తున్నా.
ఇదీ చదవండి: Gopichand: బ్యాడ్మింటన్‌లో మూడు పతకాలు ఖాయం
పతకం కోసమే ప్రయాణం..
60 లేదా 70వ ర్యాంకర్ ఆలోచన విధానం భిన్నంగా ఉంటుందేమో. కానీ ఆటపరంగా ఇప్పటికే నిరూపించుకున్న నాకు పతకం సాధించడాని కంటే తక్కువ ప్రదర్శన ఇష్టం ఉండదు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో అంచనాలు కూడా పెరిగాయి. నేను పతకం కోసమే ఆడతా. గత ఒలింపిక్స్‌లో సింధు రజతం గెలిచింది. ఈసారి కూడా ఆమెకు పతకం ఖాయమనుకుంటున్నా. సాత్విక్- చిరాగ్ జోడీకీ మంచి అవకాశముంది. 2019లో భారత క్రీడాకారుల ప్రదర్శనతో అంచనాలు పెరిగాయి. అయితే వాటి గురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. కష్టపడినందుకు నూటికి నూరు శాతం ప్రదర్శన ఇవ్వాలని భావిస్తున్నా.
అప్పుడే కుదుటపడేది..
కరోనా దృష్ట్యా ఒలింపిక్స్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీడాగ్రామంలో వేల మంది క్రీడాకారులు ఉంటారు. జిమ్, భోజనశాలకు వెళాల్సి ఉంటుంది. పోటీలకు ముందు.. మధ్యలో.. ముగిసే వరకు కరోనా బారినపడకుండా ఉండటం ముఖ్యం. రోజూ పరీక్షలు నిర్వహిస్తారు. మానసికంగా కొంచెం కష్టమే అయినా తప్పదు. కరోనా మొదలై ఏడాదిన్నర దాటుతోంది కాబట్టి ఇప్పుడు అలవాటైంది. జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. కరోనా గురించి అతిగా ఆలోచించట్లేదు. ఆట మీదే నా ధ్యాసంతా. తొలిసారిగా ఒలింపిక్స్‌కు వెళ్తున్నా. విశ్వ క్రీడల్లో ఆడాలన్నది ప్రతి క్రీడాకారుడి కల. నాకు చాలా ఆనందంగా ఉంది. కొంచెం ఆందోళన కూడా లేకపోలేదు. ఎప్పుడెప్పుడు పోటీలు ప్రారంభమవుతాయి.. తొలి రౌండ్ ఎప్పుడు ఆడతాననో అని ఎదురుచూస్తున్నా. అప్పటి వరకు నా మనసు కుదుటపడదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.
ఇదీ చదవండి: Covid Effect: కీలక బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు