బర్మింగ్‌హామ్ వేదికగా ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజయవంతంగా ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పురుషుల విభాగంలో విక్టర్ అక్సెల్సన్(డెన్మార్క్).. మహిళల్లో తైజు యింగ్(చైనా) విజేతలుగా నిలిచారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన డెన్మార్క్ షట్లర్‌గా విక్టర్ రికార్డు సృష్టించాడు.
తుదిపోరులో అక్సెల్సన్.. ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ చౌ తియెన్ చెన్పై 21-13, 21-14 తేడాతో విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ అగ్రషట్లర్ చెన్ యుఫెను 21-19, 21-15 తేడాతో బోల్తా కొట్టించింది తైజు. గతంలో ఈమె 2017, 2018లలో టైటిల్స్ సాధించింది. ఛాంపియన్లుగా నిలిచిన వారికి తలో 77 వేల డాలర్లు(రూ.57 లక్షలు) ప్రైజ్‌మనీ ఇస్తారు.
మహిళల డబుల్స్‌లో జపాన్ ద్వయం యుకీ ఫుకుషిమా-సయాకా హిరోటా.. చైనాకు చెందిన డుయీ- లీ ఇన్యూపై 21-13, 21-15 తేడాతో గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఇండోనేసియాకు చెందిన ప్రవీణ్ జోర్డాన్-మెలాటి దైవా జోడీ.. థాయ్‌లాండ్ ద్వయం డచపోల్- సప్సిరీపై 21-15, 17-21, 21-8 తేడాతో విజయం సాధించింది.