ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా(కోవిడ్-19) కారణంగా ఎన్నో టోర్నీలు రద్దయినా.. నేటి నుంచి బర్మింగ్‌హామ్‌లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. అయితే ఈ వైరస్ భయంతో పలువురు భారత షట్లర్లు, ఈ పోటీలకు దూరంగా ఉండనున్నారు. స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ మాత్రం ఒలింపిక్స్ దృష్టిలో పెట్టుకొని బరిలో దిగనున్నారు. టోక్యో అర్హతలో భాగంగా ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకునేందుకు వీరికి ఈ పోటీలు సువర్ణావకాశంగా మారనున్నాయి.
ఈసారైనా ఆ ద్రాక్ష అందేనా?
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచినా, ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించినా, లెక్కలేనన్ని సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచినా భారత క్రీడాకారులకు అందని ద్రాక్షగా మిగిలిన ఏకైక టోర్నీ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్. ఇప్పటివరకు సింధు ఏడుసార్లు, సైనా 13 మార్లు బరిలోకి దిగినా, టైటిల్ మాత్రం దక్కించుకోలేకపోయారు. 2018లో సెమీస్ చేరుకోవడమే సింధు అత్యుత్తమ ప్రదర్శన. 2015లో ఫైనల్ చేరిన సైనాకు టైటిల్ అందినట్లే అంది చేజారింది.1980లో ప్రకాశ్ పదుకొణె, 2001లో పుల్లెల గోపీచంద్.. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్లుగా నిలిచారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా భారత షట్లర్లకు ప్రతిష్టాత్మక టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. టోక్యో ఒలింపిక్స్ సమీపిస్తున్న నేపథ్యంలో సింధు, సైనాలలో ఒక్కరైనా అత్యుత్తమ ఫామ్‌తో ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ సాధిస్తారేమో చూడాలి.
తలపడేది వీరితోనే
నేటి నుంచి 15 వరకు ఈ టోర్నీ జరగనుంది. మహిళల తొలి రౌండ్లో బీవెన్ జాంగ్ (అమెరికా)తో ఆరో సీడ్ సింధు తలపడనుంది. ప్రీ క్వార్టర్స్‌లో జిందాపోల్ (థాయ్‌లాండ్) లేదా సుంగ్ హ్యున్ (కొరియా)తో సింధు పోటీపడొచ్చు. క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ నొజొమి ఒకుహర (జపాన్) ఎదురయ్యే అవకాశముంది.
- ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ కోసం ప్రయత్నిస్తున్న సైనాకు కఠినమైన డ్రా పడింది. తొలి రౌండ్లో మూడో సీడ్ అకానె యమగూచి (జపాన్)తో తలపడుతుంది. తొలి రౌండ్ దాటితే ప్రీ క్వార్టర్స్‌లో సయాక తకహాషి (జపాన్) లేదా ఎవ్‌జినియా (రష్యా) ఎదురయ్యే అవకాశముంది. దీనిని అధిగమిస్తే క్వార్టర్స్‌లో కరోలినా మారిన్ (స్పెయిన్)తో పోటీపడొచ్చు.
- కిదాంబి శ్రీకాంత్.. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో, సాయి ప్రణీత్‌తో జున్ పెంగ్ (చైనా), పారుపల్లి కశ్యప్‌తో షెసర్ హిరెన్ (ఇండోనేసియా), లక్ష్యసేన్‌తో లీ చుక్ (హాంకాంగ్) తలపడతారు.
- మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సెత్యానా- గ్రోన్య (ఆస్ట్రేలియా)తో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప, వివియన్ హూ- చెంగ్ వెన్ (మలేసియా)తో పూజ-సంజన పోటీపడనున్నారు.
- మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ జెంగ్ వీ- హువాన్ కియాంగ్ (చైనా)తో ప్రణవ్ చోప్రా- సిక్కిరెడ్డి, లీ హ్యు- చింగ్ (చైనీస్ తైపీ)తో సాత్విక్- అశ్విని పోటీపడతారు.
కరోనా కారణంగా వారు దూరంకరోనా వైరస్ కారణంగా ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు కొంతమంది భారత షట్లర్లు దూరమయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ నుంచి సింగిల్స్ ఆటగాళ్లు హెచ్‌ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ.. డబుల్స్ షట్లర్లు సాత్విక్- చిరాగ్, సుమీత్ రెడ్డి- మను అత్రి తప్పుకున్నారు.ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3,300 మందికిపైగా మరణించారు. వివిధ దేశాల్లో ఈ వైరస్ కేసులు గణణీయంగా పెరుగుతున్నాయి.