పింక్, ముల్క్, బద్లా లాంటి చిత్రాలతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. ప్రస్తుతం'సాండ్ కీ ఆంఖ్' అనే చిత్రంలో నటిస్తోంది. ప్రపంచ వయోధిక షూటర్లుగా పేరు గాంచిన చాంద్రో, ప్రకాషీ తోమర్ల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ హృదయాన్ని హత్తుకునేలా ఉందని సినిమాపై ప్రేమను వ్యక్తపరిచిందీ దిల్లీ భామ. ఈ చిత్రంలో తాప్సీతో పాటు భూమి పడ్నేకర్ కూడా నటిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో ఓ చిన్న గ్రామానికి చెందిన చాంద్రో, ప్రకాషీ అనే మహిళలు జాతీయ స్థాయి షూటింగ్లో సత్తాచాటారు. చాంద్రో 30 జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో సత్తా చాటి అత్యధిక వయసు గల షూటర్‌గా పేరు గడించింది. ప్రకాషీ 25 పైగా టైటిల్స్ నెగ్గి రెండో వయోధిక షూటర్‌గా నిలిచింది.
"ఈ సినిమా నేను ఎంచుకునే కథలకు విభిన్నంగా ఉన్నా.. కథ మాత్రం నా హృదయాన్ని హత్తుకుంది. ఇంతకంటే ఏం చెప్పలేను. ఈ చిత్రంతో ప్రేక్షకులు మమ్మల్ని చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమా కోసం షూటింగ్ కూడా నేర్చుకున్నాను. 60 ఏళ్ల మహిళ పాత్రలో నటించడం చాలా కష్టంగా అనిపించింది" - తాప్సీ
సినిమాలో 85 శాతం వరకు 60ఏళ్ల మహిళగానే తాప్సీ కనిపించనుంది. అనురాగ్ కశ్యప్, నిధి పామర్ 'సాండ్ కీ ఆంఖ్' చిత్రానికి నిర్మాతలు. తుషార్ హిరాన్దానీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాతో పాటు అక్షయ్ కుమార్‌తో 'మిషన్ మంగల్', 'గేమ్ ఓవర్' చిత్రాల్లోనూ తాప్సీ నటిస్తోంది.